కేటీఆర్ అంత తిట్ట‌లేనంటూ తిట్టేశారు

Update: 2018-03-01 10:09 GMT
సంప్ర‌దాయానికి బందీ అయ్యేటోళ్ల‌కు బాధ‌లు అన్నిఇన్ని కావు. ఓవైపు దూకుడు రాజ‌కీయాల దూకుడు త‌ట్టుకోలేరు.. అదే టైంలో వాటికి దూరంగా ఉండ‌లేరు. ఇలా ముందుకు వెళ్ల‌లేక‌.. వెన‌క్కి పోలేక కిందామీదా ప‌డే రాజ‌కీయ నేత‌లు కొంద‌రుతెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తుంటారు. అలాంటి వారిలో సీనియ‌ర్ నేత జానారెడ్డి ఒక‌రు. మొన‌గాడు నేత‌గా చెప్పుకునే ఆయ‌న.. త‌న‌కు తాను సంప్ర‌దాయాల‌కు నిలువెత్తు రూపంగా అభివ‌ర్ణించుకుంటారు. మ‌రోవైపు.. ఆయ‌న తీరుకు  సొంత పార్టీ నేత‌లు సైతం ఫీల్ కావ‌టం క‌నిపిస్తుంటుంది.

గులాబీ నేత‌ల మాట‌ల దూకుడు ముందు వెల‌వెల‌బోయిన‌ట్లు క‌నిపించే జానా అండ్ కోకు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. అధికార టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మొద‌లుకొని ఆయ‌న కుమారుడు కేటీఆర్ వ‌ర‌కూ అన్ని ఏజ్ ల నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేయ‌టం జానాలాంటి నేత‌ల‌కు పెద్ద క‌ష్టంగా మారింది.

రాజ‌కీయం అంటే రాజ‌కీయ‌మేన‌న్న‌ట్లుగా మాట్లాడే టీఆర్ఎస్ నేత‌లపై మాట‌ల యుద్ధంలో ఎలా నెగ్గాలో అర్థం కాక కిందామీదా ప‌డుతున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. మంత్రికేటీఆర్ మాట్లాడుతూ.. జానాబాబా దొంగ‌లంటూ అలీబాబా దొంగ‌ల‌న్న మాట‌నుత‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్చేసిన వైనంపై జానా తెగ ఫీల‌వుతున్నారు. తాజాగా సీఎల్పీలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నార‌న్నారు.

అగ్రనేత‌ల్ని తిడితే స్థాయి పెరుగుతుంద‌ని కేటీఆర్ అనుకుంటున్నార‌ని.. ప‌డిక‌ట్లు ప‌దాల‌తో ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడుతున్నార‌న్నారు. కేటీఆర్ మాదిరి దిగ‌జారి మాట్లాడ‌లేన‌ని చేతులెత్తేశారు. గ‌ర్వాంధులంటూ నోరు తిర‌గ‌ని మాట‌ల్ని కాస్త క‌ష్టంగా ప‌లికిన జానా.. ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బుద్ధి చెబుతార‌న్నారు.

టీఆర్ ఎస్ పుట్ట‌క‌ముందే న‌ల్గొండ ఫోర్లైడ్ పై పోరాడామ‌ని.. తాము ప‌వ‌ర్లోకి రాగానే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌న్న జానా.. తాము దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని.. చివ‌ర్లో పూర్తి చేసి పేరు వేసుకుంటూ గొప్ప‌లు చెప్పుకున్నారంటూ మండిప‌డ్డారు. ఏమైనా.. కేటీఆర్ దూకుడు మాట‌ల ముందు జానా వారి మాట‌లు తేలిపోయాయ‌ని చెప్పాలి. జ‌న‌రేష‌న్ గ్యాప్ ను జానా మాత్రం ఎలా ఫిల్ చేయ‌గ‌ల‌రు చెప్పండి?
Tags:    

Similar News