జానారెడ్డి ‘కాంగ్రెస్’ తెలివి.. సాగర్ ఉప ఎన్నికల్లో కొడుకు పేరు భలే తెచ్చారుగా

Update: 2021-01-30 16:30 GMT
రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. అందరికి గురువులాంటిది కాంగ్రెస్. దేశాన్ని అత్యధిక కాలాన్ని ఏలిన ఈ పార్టీ వ్యూహాలు.. ఆ పార్టీ నేతల రాజకీయ తెలివి మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. గడిచిన కొద్దికాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న ఆయన.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని వార్తల్లోకి వచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా లేనప్పటికి తన అవసరం ఉన్న వేళలో చటుక్కున తెర మీదకు వచ్చే ఆయన ఎంత శక్తివంతుడనే దానికి నిదర్శనంగా టీ కాంగ్రెస్ రథసారధి నియమకాన్ని తన నోటి నుంచి వచ్చిన ఒక్క మాటతో ఆపేలా చేయటాన్ని మర్చిపోలేం. సాగర్ ఉప ఎన్నిక తర్వాతే.. టీపీసీసీ ఛీప్ ఎంపిక చేయాలనటం తెలిసిందే.  

ప్రతిష్టాత్మకంగా మారనున్న సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్కును ఇప్పటికే మొదలు పెట్టాయి రాజకీయ పార్టీలు. ఎవరికి వారుగా ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా పయనించేందుకు అవసరమైన ఎత్తులతో పాటు.. టికెట్ సాధనకు అవసరమైన లాబీయింగ్ షురూ చేశారు. ఇప్పటివరకు తానే బరిలో ఉంటానని చెప్పిన జానారెడ్డి.. తాజాగా పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తన కుమారుడు సామాన్య కార్యకర్తగా పోటీ చేస్తారన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.. తనను ప్రకటించారన్నారు.

ఓవైపు పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత.. తన కొడుకు సామాన్య కార్యకర్తగా పోటీ చేయటానికి సిద్ధమనే జానారెడ్డి మాటల్ని వింటే.. అసలుసిసలు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఇట్టే కనిపిస్తుందని చెప్పాలి.  తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం ఉండవని.. వాటిని ప్రోత్సహించనని చెబుతూనే.. మరోవైపు మాత్రం తన కుమారుడ్ని ఉప ఎన్నికల బరిలో నిలుపుతానని చెప్పే మాటలు ఆసక్తికరంగా మారాయి. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కాంగ్రెస్ గురించి ఆయన  నోటి నుంచి వచ్చిన మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే.

వారసత్వ రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ అస్సలు ప్రోత్సహించదన్న ఆయన.. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకాలకు పేరు మార్చి.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఏమైనా.. ఇప్పటివరకు సాగర్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జానారెడ్డి.. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అభ్యర్థి మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేయాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News