రాజమండ్రిలో పీకే పార్టీ ఆవిర్భావ సభ..సింగిల్ ఎమ్మెల్యే రాలేదబ్బా!

Update: 2020-03-14 14:13 GMT
తెలుగు నేల రాజకీయాలను సమూలంగా మార్చేస్తానంటూ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ శనివారం ఆరో వసంతాన్ని పూర్తి చేసుకుంది. ఆరేళ్ల ప్రస్థానంలో చాలా ఎన్నికలే వచ్చినా... అన్నింటినీ స్కిప్ చేసి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసిన జనసేన... ఘోరంగా దెబ్బ తిన్నది. 175 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన... కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. అది కూడా పార్టీ అధినేతకు చెందిన సీటు కానే కాదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్... జనసేన తరఫున విజయం సాధించి పార్టీని అసెంబ్లీలో అడుగుపెట్టించారు. ఈ లెక్కన చూస్తే... జనసేనకు రాపాక కీలక నేతేనని చెప్పక తప్పదు. అయితే జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ఆవిర్భావ సభకు ఆయన దూరంగా ఉండిపోయారు.

శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా జనసేన ఆరో ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పవన్ సోదరుడు నాగేంద్రబాబులతో పాటు జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంతో మాట్లాడిన పవన్... తానెందుకు రాజకీయాల్లోకి వచ్చాను? తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతోంది? జనసేనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? తదితర అంశాలపై తనదైన శైలిలో ప్రసంగించారు. పనిలో పనిగా పార్టీ తరఫున విజయం సాధించిన ఏకైన ఎమ్మెల్యే రాపాక ఈ సభకు ఎందుకు రాలేదన్న విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు.

పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆయన విజ్ఝతకే వదిలేస్తున్నానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చిన వారు చివరి నిమిషంలో వేరే పార్టీలోకి వెళితే మనం చేసేదేమీ లేదని కూడా పవన్ పేర్కొన్నారు. ఆ దిశగానే రాపాక సాగారని, ఈ విషయంలో ఆయన గురించి మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదని, రాపాక ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని రాపాకకే వదిలేస్తున్నానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా పార్టీ ఆరో ఆవిర్భావ వేడుకకు రాపాక దూరంగా ఉండటం, తన పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించి... ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైనం తనను ఎంతగా ఇబ్బందికి గురి చేస్తోందన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News