ఇలా అయితే బారెడు. బెత్తడు మాటలు తప్పవంతే

Update: 2015-10-10 05:27 GMT
పెద్దరికం అన్న ట్యాగ్ తో అధికారపక్షంపై ఆచితూచి విమర్శలు చేసే తత్వం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డిది. మరి.. అలాంటి సంప్రదాయ నేతపై దూకుడుతనానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటే టీఆర్ ఎస్ ముఖ్యనేతలు చెలరేగిపోతుంటారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడరు.

అవసరానికి తగ్గట్లు పెద్దమనిషి.. విశేష అనుభవం ఉన్న వారంటూ కీర్తిస్తూనే.. పంచ్ వేయాల్సిన సమయాల్లో భారీ పంచ్ లు వేసే తీరు గులాబీదళంలో కనిపిస్తుంది. ఆ కోవలోనే.. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. జానారెడ్డి ఇమేజ్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీస్తున్న తెలంగాణ అధికారపక్షం.. జానారెడ్డిని ఉద్దేశించి ‘‘బారెడు మాటలు చెప్పి బెత్తెడు పని చేయలేదంటూ’’ ఆడిపోసుకున్నారు.

దీనిపై మండిపడ్డ ఆయన.. మంత్రి కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారని.. తన గురించి ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించటం కోసమే తాము యాత్రలు చేపట్టినట్లుగా జానా చెప్పుకున్నారు. తనను తాను గొప్పగా భావించే జానారెడ్డి.. అధికారపక్షం ప్రశంసించిన సమయంలో ఎక్కడికో వెళ్లిపోయే ఆయన.. ఆ మత్తులోనే అధికారపక్షంపై విరుచుకుపడటం మానేసి.. తన రేంజ్ ఏమిటో మంత్రి కేటీఆర్ లాంటి వాళ్లకు తెలీదంటూ తనను తాను పొగిడేసుకుంటున్న జానారెడ్డిని చూస్తే.. రానున్న రోజుల్లో ఆయనపై మరిన్ని జానెడు.. బెత్తడు తరహా విమర్శలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News