టీడీపీతో జనసేన పొత్తు.. సీఎం ఎవరంటే... ?

Update: 2021-12-06 10:27 GMT
పొత్తు రాజకీయాలు బహు చిత్రంగా ఉంటాయి. అవసరం తీరేంతవరకూ ఓడ మల్లన్న, తీరాక బోడి మల్లన్న అన్న చందంగా ఉంటుంది కధ. దేశ రాజకీయాల్లో ఎక్కడ చూసినా పొత్తులు ఎపుడూ సుదీర్ఘంగా కొనసాగిన చరిత్ర అయితే లేదు.

అటూ ఇటూ అవసరాలకు మాత్రమే ఈ స్నేహాలు కలుస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో పొత్తుల మీద ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అధికార వైసీపీ నేతలు అయితే సింహం సింగిల్ గా వస్తుంది, అంటూ ఇతర పార్టీలతో పొత్తులకు ఎపుడూ అవకాశం లేదని తేల్చేశారు.

మరోవైపు చూస్తే టీడీపీ ఈసారి ఒంటరిగా వెళ్లి చేయి కాల్చుకోకూడదని ఆలోచిస్తోందని చెబుతున్నారు. 2019 ఎన్నికలో చేసిన తప్పుని కానీ రిస్క్ ని కానీ రిపీట్ చేయరాదన్నదే టీడీపీ పెద్దల ఆలోచనగా ఉంది.

మరి టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అంటే కళ్ళ ఎదుట రెండు పార్టీలు కనిపిస్తున్నాయి. ఆ రెండూ కూడా గతంలో టీడీపీ వెంట నడచినవే. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి.

ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. దాంతో నాటి పొత్తుల వెనక చిక్కులూ చికాకులూ ఏమీ లేవు. అయితే 2024 నాటికి జనసేనతో టీడీపీ పొత్తు అంటే చాలా లెక్కలు చూడాల్సి ఉంది. అన్నింటికీ మించి జనసేన ఈ మధ్యకాలంలో తన సొంత అస్థిత్వాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్నది కూడా వాటా తేల్చాలి.

జనసేన క్యాడర్ కి అయితే పవనే మా సీఎం అన్న భావన ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల వేళ చూస్తే తాను సీఎం అయితే ఫలానా పని చేస్తాను అంటూ చాలానే చెప్పారు. ఇక ఈ మధ్య కూడా ఆయన అనంతపురం పర్యటనలో మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే కర్నూల్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. అంటే పవన్ మదిలో సీఎం సీటు మీద ఆలోచన, ఆశ ఉందని అర్ధమవుతోంది.

మరి అదే టైమ్ లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఆశ నెరవేరుతుందా అన్నదే అందరి డౌట్ గా ఉంది. పవన్ 2014 నాటి నాయకుడు మాత్రం కాదు, ఆయన రాజకీయంగా రాటుదేలారు, చాలా దూరం నడిచారు. ఎన్నో రకాలైన వ్యూహాలను చూశారు. మరి పవన్ తో పొత్తు అంటే ఈసారి అంత ఈజీ కాబోదు అన్న మాట కూడా ఉంది.

దీని మీద సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదరాలని దిగువ స్థాయిలో రెండు పార్టీల క్యాడర్ కోరుకుంటున్నాయని చెప్పారు. ఇక తేల్చాల్సింది రాష్ట్ర స్థాయిలోనే అని కూడా చెప్పేశారు. పొత్తు కుదిరితే రెండు పార్టీలకే కాదు, ఏపీకి కూడా ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అంటున్నారు.

ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈ పొత్తు అనివార్యం అని కూడా ఆయన అంటున్నారు. ఇక సీట్ల షేరింగ్ అన్నది పెద్ద సమస్య కాబోదని ఆయన అన్నారు. ఏపీలో 175 సీట్లు ఉన్నాయని, రెండు పార్టీలకు 2019 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న దాని మీదనే సీట్ల వాటా తేలుతుందని అన్నారు. ఆ ఎన్నికల్లో జనసేనకు 6.5 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి దాదాపుగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. ఈ ప్రాతిపదికనే సీట్ల ఒప్పందం జరగాలని అయ్యన్న అంటున్నారు.

అదే కనుక జరిగితే జనసేనకు గట్టిగా పదిహేను సీట్ల కంటే ఎక్కువగా వచ్చే చాన్సే లేదు అంటున్నారు. మరి ఏపీలో ఆల్టర్నేషన్ పాలిటిక్స్ అంటూ బీజేపీతో చేయి కలిపిన పవన్ ఈ పదిహేను సీట్లతో సర్దుకోగలరా అన్నది ఒక ప్రశ్న. ఇక జనసేనకు ఎక్కువగా గోదావరి జిల్లాలోనే బలం ఉందని, అది కూడా కొన్ని ప్రాంతాలలోనే అని తమ్ముళ్ళు చెబుతున్నారు.

ఆ విధంగా చూస్తే ఇచ్చిన పదిహేను సీట్లలో కూడా మెజారిటీ అక్కడే ఇచ్చేసి జనసేనను బుజ్జగిస్తారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే జనసేన మాత్రం కచ్చితంగా యాభై దాకా సీట్లు కోరే చాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాదు, సీఎం సీటు ఇవ్వకపోయినా డిప్యూటీ సీఎం అయినా కోరే చాన్స్ ఉందని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూడా గత రెండున్నరేళ్లలో తన ఓటు బ్యాంక్ ని చాలా మటుకు కోల్పోయిందని, అదే సమయంలో జనసేన పుంజుకుంటోందని ఆ పార్టీ నేతల వాదనగా ఉంది. అందువల్ల చెరి సగం సీట్లలో పోటీ చేసి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే సీఎం అభ్యర్ధి అన్న ప్రతిపాదన కూడా జనసేన పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే టీడీపీ మాత్రం జనసేన బీజేపీలకు పాతిక మించకుండా సీట్లు కేటాయించి మిగిలిన 150 సీట్లలో పోటీ చేసి కూటమి బలంతో అధికారంలోకి రావాలని చూస్తోంది. చంద్రబాబు సీఎం కావాలన్నదే ఆ పార్టీ మాటగా ఉంది. మరి ఈ పొత్తు పొడుపు ఎపుడో, ఈ చిక్కు ముడులు వీడేది ఎపుడో వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News