బాబు చెబితే వినాలి... అంతే...!

Update: 2023-03-18 21:00 GMT
ఏపీలో విపక్ష కూటమికి పెద్దన ఎవరు అంటే రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారు ఎవరైనా తెలుగుదేశం పార్టీయే అని చెబుతారు. కానీ రాజకీయాలు అంటేనే ఎన్నో సమీకరణలు. రంగులు ఉంటాయి. దాంతో ఎపుడు ఎవరి చక్రం గిర్రున తిరుగుతుందో తెలియదు. ఇదిలా ఉంటే ఏపీలో రెండు పొలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయన్న తీరున రాజకీయం సాగుతోంది. వైసీపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగా సీన్ ఉంది. కానీ మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయింది.

జనసేన బలం ఎంత అని ప్రూవ్ చేసే విధంగా గడచిన నాలుగేళ్ల కాలంలో ఏ విధమైన కొలమానం దొరకలేదు. పవన్ సభలకు జనాలు వస్తున్నారు. పైగా గతంతో పోలిస్తే మా గ్రాఫ్ పెరిగింది అని వారు చెప్పుకుంటున్నారు. అయితే డైరెక్ట్ గా ఎన్నికల్లో పాల్గొని ఓట్ల శాతం పెంచుకుని ఉంటే జనసేన లెకక్ వేరే విధంగా ఉండేది అన్న మాట ఉంది. ఆ విషయంలోనే ఇపుడు జనసేనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మాకు బలం ఉంది పెరిగింది అని వస్తున్న సర్వేలు వేరు. డైరెక్ట్ గా జనంలో నుంచి వచ్చిన తీర్పులు వేరు. ఇప్పటి దాకా ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలు సహా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన ఓటు బ్యాంక్ ని పదిలపరచుకోవడమే కాకుండా నాలుగేళ్ల విరామం తరువాత పట్టభద్రుల ఎన్నికల్లో విజయభేరీ మోగించింది. అది కూడా సింగిల్ గానే. ఏ పొత్తులూ లేకుండానే.

పైగా ఆర్భాటాలు కానీ ప్రచార హోరు కానీ లేదు. చంద్రబాబు ప్రజలకు లేఖల ద్వారా అప్పీల్ చేయడం తప్ప మీటింగ్స్ ఏవీ పెట్టలేదు. గతంలో మాదిరి హైరానా పడిపోలేదు. ఇక అధికార పార్టీ వైసీపీ నుంచి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా టీడీపీ మాత్రం పార్టీ క్యాడర్ నే నమ్ముకుంది. జనాలను విశ్వసించింది. ఫలితం సూపర్ గా వచ్చింది. దీంతో ఇపుడు టీడీపీలో ధీమా పెరిగింది.

అదెలా అంటే ఉత్తరాంధ్రాలో వైసీపీ పాతుకుపోయామని చెబుతోంది. అక్కడ తన కంచుకోటను టీడీపీ కాపాడుకుంది. ఇక రాయలసీమ జిల్లాలలో దశాబ్దలా కాలం తరువాత అంటే వైసీపీ పుట్టక ముందు కాంగ్రెస్ ఏలుబడి నుంచి కూడా టీడీపీకి చెడ్డ రోజులే ఉంటూ వచ్చాయి. అలాంటి చోట ఇపుడు అనుకూల పవనాలు వీస్తునాయి. దాంతో టీడీపీలో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది అని అంటున్నారు. ఎటూ కొస్తాలో టీడీపీకి గట్టి పట్టుంది. క్రిష్ణా గుంటూరు జిల్లాలలో సైకిల్ పరుగుని ఎవరూ వచ్చే ఎన్నికల్లో ఆపలేరు అంటున్నారు.

గోదావరి జిల్లాలలో కూడా టీడీపీకి మంచి పునాది ఉంది. అందువల్ల టీడీపీ పొత్తులను ఏ మాత్రం వద్దు అనుకోవడంలేదు. కాకపోతే ఎవరైనా  ఇక బేరాలు రాయబేరాలు వంటివి పక్కన పెట్టేయాల్సిందే. ఆయా పార్టీల బలాబలాలను బట్టి  తెలుగుదేశం సీట్లను ఇస్తుంది. ఏపీలో కుదిరితే బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులతో ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ చూస్తోంది. వామపక్షాలకు అయితే చెరి మూడు కంటే ఎక్కువ సీట్లు ఇచ్చే సీన్ లేదని అంటున్నారు. అలాగే బీజేపీ అయితే అరడజన్ కి మించి సీట్లు   ఇచ్చేది    లేదని  చెబుతున్నారు.

ఇక టీడీపీ తరువాత పెద్ద పార్టీగా ఉన్న జనసేనకు ఇరవై సీట్లు ఇస్తారన్న ప్రచారం ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. దాన్ని మచిలీపట్నం సభలో పవన్ కూడా ఖండించారు. కానీ జనసేన విషయంలో టీడీపీ ఆలోచనలు దాదాపుగా ఆ నంబర్ దగ్గరే ఆగే సూచనలు అయితే ఉన్నాయని అంటున్నారు. పదిహేను నుంచి మొదలెట్టి ఇరవైతో ముగించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు ఎటూ జనాభిప్రాయం తెలిసింది. ఏపీ జనాలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.

చంద్రబాబునే సీఎం గా చూడాలని అనుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భగంగా పాతిక సీట్లను వదిలేసుకుని 150 సీట్లకు కచ్చితంగా పోటీ చేస్తుంది అన్నది ఈనాటి మాట. ఇదే నిజం అని కూడా అంటున్నారు. అంతకు మించి ఎవరు బేరాలడినా కుదిరే సీన్ అయితే లేదు అని అంటున్నారు.

జనాలు కూడా తెలివైన వారు అని ఒకవేళ పొత్తు వద్దనుకుని ఎవరైనా విడిగా పోటీ  చేసిన ఓట్ల చీలిక ప్రయత్నాలు ఫలించవని కూడా తెలుగుదేశం గట్టిగా విశ్వసిస్తోంది. ప్రజలు తాము కోరుకున్న పార్టీనే ఎన్నుకుంటారని అది గతంలో చాలా చోట్ల రుజువు అయిందని కూడా భావిస్తోంది. మొత్తానికి పొత్తుల వత్తిడితో సతమతమవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త దారిని చూపించాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News