పవన్‌పై భద్రత జనసేన ఆర్మీ ప్రత్యేక దృష్టి పెట్టిందా?

Update: 2022-11-03 05:34 GMT
నయానా భయానా పవన్‌ కల్యాణ్‌ను రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారనే జనసేన పార్టీ వర్గాలు, పవన్‌ అభిమానులు అనుమానిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటన దగ్గర నుంచి ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించడం, అర్ధరాత్రి జనసేన నేతల అక్రమ అరెస్టులు, పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలపై లాఠీచార్జ్, పవన్‌ను నోటీసులు ఇవ్వడం, జనసేన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం... వీటన్నింటిపై విశాఖ నుంచి మంగళగిరి వచ్చాక పవన్‌ తీవ్ర స్థాయిలో చెప్పు చూపిస్తూ స్పందించడం వంటి కారణాలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

మరోవైపు తనను, తన సతీమణి, పిల్లలను చంపుతామని, రేప్‌ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పవన్‌.. దివంగత నేత వంగవీటి మోహన్‌ రంగా హత్యను గుర్తు చేసుకున్నారు. ఆయన సభలకు లక్షల్లో వచ్చిన జనాలు ఆయనను కాపాడుకోలేకపోయారని చెప్పారు. వంగవీటి రంగాను హత్య చేస్తున్నప్పుడు ఆయన పక్కన ఎందుకు లేరని నిలదీశారు.

తనను సైతం చంపుతామని బెదిరిస్తున్నారని పవన్‌ ఇటీవల కాలంలో పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు తగినంతమంది పోలీసుల భద్రత కల్పించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్‌ విశాఖ పర్యటనలో లైట్లు తీసేయడం, ఆయనకు తగినంత సెక్యూరిటీ కల్పించకపోవడం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇదే అనుభవం ఎదురవుతోందని గుర్తు చేస్తున్నారు. ఆయనకు జెడ్‌ కేటగిరీ భద్రత ఉంది. నేషనల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు కూడా పోలీసులు సరిగా భద్రత కల్పించడం లేదని ఇటీవల తేటతెల్లమైంది. దీంతో చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో నేరుగా ఎన్‌ఎస్‌జీనే జోక్యం చేసుకుంది. చంద్రబాబుకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో డీఐజీ స్థాయి ర్యాంకు అధికారి పర్యవేక్షణలో చంద్రబాబు భద్రతను పెంచింది.

ఇప్పుడు మరో ప్రతిపక్ష నేత పవన్‌ కల్యాణ్‌కు సైతం ఇదే అనుభవం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో జనసేన ఆర్మీనే పవన్‌ కల్యాణ్‌కు భద్రత కల్పించడానికి సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బలమైన యువకులను గుర్తించి వారికి జనసేన పార్టీ శిక్షణ ఇవ్వనుందని చెబుతున్నారు. వీరి ద్వారా పవన్‌ భద్రతకు ఒక ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పోలీసులపై నమ్మకం లేకపోవడంతో సొంత భద్రతను నమ్ముకోవాలని పవన్‌ కూడా నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్నారు.

దీంతో ఇక నుంచి జనసేన ఆర్మీనే పవన్‌ కల్యాణ్‌ రక్షణ బాధ్యతలను చూసుకోనుందని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ రాకపోకలు, పర్యటనలకు సంబంధించి జనసేన ఆర్మీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News