యువ‌త‌లో తీవ్ర నిరాశ‌..రెండు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తాఃప‌వ‌న్‌

Update: 2017-12-05 13:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు విడతలుగా పర్యటించాలని నిర్ణయించుకున్న‌ట్లు జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. తొలి విడత పర్యటన సమస్యలపై పరిశీలన - అధ్యయనం - అవగాహన కోసం కాగా రెండో విడత పర్యటనలో ఆయా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే సరే, లేని పక్షంలో ప్రభుత్వ భాద్యతను (పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ) గుర్తు చేస్తామని వెల్ల‌డించారు. అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుంటే మూడో విడత పర్యటనను పోరాట వేదికగా మారుస్తామ‌ని తేల్చిచెప్పారు. ఈ మేర‌కు ప‌వ‌న్ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటనలో భాగంగా రేపటి నుంచి మీ ముందుకు వస్తున్నాన‌ని జ‌న‌సేన పార్టీ అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. ముందుగా విజయనగరం - ఉస్మానియా యూనివర్సిటీలలో ఆత్మార్పణం చేసుకున్న యువకులు వెంకటేష్ - మురళి -కృష్ణ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో అశువులు బాసిన వారి కుటుంబాల వారిని పరామర్పించడం త‌న‌ విధిగా భావిస్తున్నానని ఆయ‌న వెల్లడించారు. ` ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మురళి కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్పించడానికి పోలీస్ ఆంక్షలు అడ్డంకిగా ఉన్నందున ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మురళి సోదరుడు రాజుతో మాట్లాడినప్పుడు అతని దుఃఖం నన్ను తీవ్రంగా కలచి వేసింది. పోలీసుల ఆంక్షలు సడలించిన తరువాత తాను స్వయంగా వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్పించాలని నిర్ణయించుకున్నాను` అని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారని ప‌వ‌న్ పేర్కొన్నారు. `ఇది దేశానికి క్షేమకరం కాదు. ఇటు బాసర ఐఐటీ - ఉస్మానియా విద్యార్థులు - అటు కడపలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి జనసేన తనవంతు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

యువతలో రాజకీయపక్షాలు - ప్రభుత్వాలు ఆశలు రేకిత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిమాణాలకు వెంకటేష్ - మురళీల ఆత్మహత్యలే నిదర్శనమ‌న్నారు. యువతలో నిర్వేదం - నిరాశ చోటు చేసుకోకుండా చూడవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉంద‌ని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి అని తేల్చిచెపుతూ...ప్రభుత్వాలు తమ భాద్యత నుంచి తప్పించుకోకూడదన్నారు. `యువత నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని తెలిపారు. విలువైన మీ ప్రాణాలను తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చకండి. పోరాడండి.సాధించండి.నేను - నాతో పాటు జనసేన సైతం మీకు అండగా ఉంటాయి` అని తెలిపారు.

మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఉటంకించాడు. `ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు - నదులు కాదు - అరణ్యాలు కాదని...కలల ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు.` అని పేర్కొన్నారు. యువతను జాగృత పరచడానికి జనసేన రూపొందించిన ఛలో రే ఛలో గీతాన్ని ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నామని ప్ర‌క‌టించారు. గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యాన్ని ఈ గీతం లో నేను పలకటం మహద్భాగ్యంగా భావిస్తున్నానని ప‌వ‌న్ తెలిపారు.

Full View
Tags:    

Similar News