జనసైనికుల డిమాండ్ కు పవన్ ఓకే అంటే.. బరిలోకి దిగేది అక్కడి నుంచే!

Update: 2022-06-01 05:30 GMT
షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఏపీ సీఎం కమ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు సైతం కన్ఫ్యూజన్ తో ఉన్నారు. ఏం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళతారన్న అంచనాతో ఉన్న విపక్షం సైతం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికలకు ముందు చోటు చేసుకునే ముందస్తు హడావుడి కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. టీడీపీ నేత నారా లోకేశ్ సైతం పాదయాత్రకు సిద్ధం కావటంతోపాటు.. త్వరలోనే షెడ్యూల్ ను విడుదల చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఎన్నికల వేడి మరింత మొదలైనట్లే. ఇలాంటి వేళలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి దిగిన ఆయన.. రెండు చోట్ల ఓటమిపాలుకావటం సంచలనమైంది. అయితే.. సంప్రదాయ పార్టీల మాదిరి డబ్బు పంపకాలకు దూరంగా ఉండటం.. ఏ ఒక్కరికి వంద రూపాయిలు డబ్బులు కానీ.. క్వార్టర్ సీసా కానీ పంపిణీ చేసేందుకు పవన్ ససేమిరా అనటంతో ఆయనకు ఓటమి ఎదురైందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమన్న మాట వినిపిస్తున్నందున.. ఈసారి గెలుపునకు ఢోకా లేదంటున్నారు. గత ఎన్నికల మాదిరే డబ్బులు పంచే విషయంలో పవన్ వైఖరి మారదంటున్నారు.  తమ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై జనసైనికులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి.. చివరకు తిరుపతి నుంచి ఆయన బరిలోకి దిగాలని కోరుతున్నారు. ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి సైతం తిరుపతి.. పాలకొల్లు నుంచి పోటీ చేస్తే.. తిరుపతిలో ఘన విజయం సాధించిన చిరు.. పాలకొల్లులో మాత్రం ఓటమిపాలయ్యారు.

తిరుపతిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్న నేపథ్యంలో.. ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని.. దాదాపు లక్షకు మించిన మెజార్టీతో విజయాన్ని సాధించటం పక్కా అన్న మాట జనసైనికుల నోటి నుంచి వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా ఏర్పడిన తిరుపతి పట్టణ నూతన కమిటీ సైతం పవన్ కల్యాణ్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని తీర్మానించింది.

ఈ నేపథ్యంలో జనసైనికుల కోరికను పవన్ తీరుస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గతానికి భిన్నంగా ఇప్పుడు పవన్ కు అన్ని సానుకూలతలు ఉన్నాయని.. ఆయన గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News