ఢిల్లీలో పవన్.. పొత్తు దిశగా బీజేపీ-జనసేన?

Update: 2020-01-13 07:35 GMT
ఏపీ రాజకీయ తెరపై ఎంతో వేగంగా దూసుకొచ్చిన జనసేనాని పవన్ కళ్యాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దెబ్బకు అంతే వేగంగా కనుమరుగయ్యే స్థితిలోకి జారిపోయారు. రెండు చోట్ల పోటీచేస్తే రెండు చోట్ల ఓడిపోయారు. ఏపీ వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క సీటు జనసేనకు వచ్చింది. భవిష్యత్తు గందరగోళం.. నేతలు జారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ప్రబలంగా అధికారంలో ఉన్న బీజేపీ సాయాన్ని పవన్ కోరుబోతున్నారట.. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పొడిపించుకునేందుకు మంత్రాంగం జరుపుతున్నారా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు..

ఏపీకి హోదా ఇవ్వని బీజేపీని మోడీషాలను తిట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ వారి పంచనకే వెళ్లారు. తాజాగా రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కొత్త రాజకీయ అండుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో భేటి అయ్యి బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు వార్తలు లీక్ అవుతున్నాయి.

ఇప్పటికే అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో పవన్ చర్చలు జరిపారు.  అయితే బీజేపీ ప్రతిపాదించిన జనసేన విలీనాన్ని పవన్ ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఇప్పుడు ‘పొత్తు’ ప్రతిపాదన తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఉండడం.. ఏపీలో టీడీపీ కుదేలు అవ్వడం చూశాక పవన్ అడుగులు కమలం పార్టీ వైపు పడుతున్నాయనట.. జనసేన కార్యవర్గ భేటిలోనూ బీజేపీతో కలవడమే బెటర్ అని నేతలు సూచించినట్టు తెలిసింది.

రహస్యంగా ఢిల్లీలో సాగుతున్న పవన్ పర్యటనలో ఒకవేళ బీజేపీతో కనుక జనసేన పొత్తు కుదిరితే రాబోయే ఏపీ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో  కలిసి పోటీచేసే అవకాశం ఉంది. మరి ఢిల్లీలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News