ఎన్నాళ్లకు సూటిగా ప్రశ్నించావ్ పవనా?

Update: 2021-11-23 05:37 GMT
కీలక నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవటం చాలా అరుదుగా సాగుతుంటుంది. అందునా.. ఏది ఏమైనా ఇలా మాత్రం జరగాల్సిందేనని అధికారంలో ఉన్న వారు డిసైడ్ అయ్యాక.. అధికారిక నిర్ణయాల్లో మార్పులు చోటు చేసుకోవటం చాలా తక్కువ. ప్రజా ఆందోళనలు.. నిరసనలు.. విపక్షాలు విరుచుకుపడటంలాంటి వాటిని లైట్ తీసుకుంటూ తాము చేయాలనుకున్నదే చేసే ధోరణి ఇటీవల కాలంలో ప్రజా ప్రభుత్వాల్లో ఎక్కువైంది. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే.. పునరాలోచనకు ప్రయత్నించేవారు.

కానీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పెయిడ్ ఆర్టిస్టు అనే ట్యాగ్ ను తగిలిస్తూ ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా కాదంటే.. ఫలానా పార్టీకి చెందిన ఫాలోయర్స్ తప్పించి.. వారేమీ ప్రజల గొంతుక కాదన్న మాటను చెప్పేందుకు వెనుకాడటం లేదు.

ఇదంతా ఎందుకంటే.. ఏపీ రాజధానిగా అమరావతి స్థానే.. మూడు రాజధానుల కాన్సెప్టు తీసుకురాటమేకాదు.. దాని మీద వచ్చే విమర్శలు.. నిరసనలు.. ఆందోళనలు.. ఆరోపణలకు ఏ మాత్రం చలించకుండా పిడివాదనను వినిపించే ధోరణి చూస్తున్నదే. ఇలాంటివేళ.. జగన్ ప్రభుత్వం తాను తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించి సంచలనంగా మారారు.

దీనిపై ఇప్పటివరకు చాలామంది స్పందించినా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్థవంతంగానే కాదు.. ఆలోచించేలా ఉన్నాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఆయనీ విషయంలో తానెంతో స్పష్టతతో ఉన్నానన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు.

అంతేకాదు.. సీఎం జగన్ తీరును సూటిగా ప్రశ్నించటంతో పాటు.. అందులోని లోపాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మిగిలిన వారి కంటే కూడా పవన్ స్పందన బాగుందని చెప్పాలి. ఇంతకీ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పిన జగన్ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

- మూడు రాజధానుల ఏర్పాటు.. సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించి కూడా మళ్లీ ప్రజల్ని అయోమయంలో నెట్టేయటమేంటి? ఇదంతా చూస్తుంటే జగన్ చేస్తున్నదంతా కూడా కోర్టు కళ్లకు గంతలు కడుతున్నట్లుగా ఉంది.

- రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని జగన్ కు భయంపట్టుకుంది. అందుకే.. ఇలా వెనక్కి తీసుకున్నారు.

- కోర్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకోవటానికి బిల్లుల రద్దుకు జగన్ సర్కారు ఉపక్రమించింది. కోర్టు తీర్పుతో రాజధాని గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో కొత్త నాటకానికి తెర తీశారు.

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నరేళ్లు అవుతున్నా రాజధాని ఎక్కడ ఉందో తెలియని స్థితికి పాలకులు తీసుకొచ్చారు. వికేంద్రీకరణతో సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చిలక పలుకులు పలుకుతున్న జగన్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారా?

- రాజధానిగా అమరావతి ఏర్పాటుపై నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో అప్పటి ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి తాను ఏం చెప్పారో ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.

- 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ లక్ష కోట్ల రూపాయిలు అవుసరమవుతాయని.. అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారంగా చెబుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి కూడా అంత విస్తీర్ణంలో లేదని ఇప్పుడు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రం కనీసం 30 వేల ఎకరాల కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయకూడదని అసెంబ్లీలో ఎందుకు చెప్పినట్లు?

- అధికారంలోకి వచ్చినంతనే ఆయన తన మాటల్ని మర్చిపోయారు. అంతేకాదు.. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులపై లాటీ చార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై మూడు వేలకు పైగా కేసులు పెట్టారు.

- మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఉద్యమంలో ఎస్సీలపై ఎస్సీలతోనే కంప్లైంట్లు ఇప్పించి అట్రాసిటీ కేసులు బనాయించారు. దారుణ చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్ని ఒకే రాజధాని చాలని ఒకే మాట మీద నిలిస్తే.. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోంది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగ నిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు.. పరిశ్రమలు రాష్ట్రమంతా విస్తరించాలి. రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలి.


Tags:    

Similar News