పొద్దున్నే మొదలుపెట్టిన జనసేన

Update: 2022-07-15 05:30 GMT
జులై 15,16,17 తేదీల్లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపైన్ .. చేయాలంటూ జ‌న‌సేన భావిస్తూ.. ఆ ప్ర‌తిపాద‌న‌లో భాగంగా ఆ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఇవాళ తొలి అడుగు వేసింది. ఇవాళ ఉద‌యం రాష్ట్రంలో ఉన్న అంద‌రు జనసైనికులూ రోడ్ల దుస్థితిపై  #GoodMorningCMSir ట్యాగ్ తో వైరల్ చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఒక కార్టూన్ తో మొదలుపెట్టారు.  ఇందులో భాగంగా ఇప్ప‌టికే ద్వార‌పూడి నుంచి తాపేశ్వ‌రం రోడ్డు., అదేవిధంగా  కోరుకొండ - వంగలపూడి రోడ్డు ఎలా ఉన్నాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తూ విజువ‌ల్స్ ను జన‌సైనికులు సోషల్ మీడియాలో  ఉంచారు.

దాదాపు అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల‌పై కూడా త‌మ గ‌ళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇంకా ప‌లు చోట్ల రోడ్ల దుఃస్థితి ఏ విధంగా చూపేందుకు, చెప్పేందుకు జ‌న‌సైనికులు ఈ డిజిట‌ల్ క్యాంపైనింగ్ లో భాగం అవుతున్నారు.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన కొత్త ఖగోళ చిత్రాలు కాదు.. ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లు... అంటూ జ‌నసేన అధికార ప్ర‌తినిధి శ్రీ‌నివాస్ కూసంపూడి అంటున్నారు. అదేవిధంగా ఈ డిజిట‌ల్ ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. తాము ఎప్ప‌టి నుంచో రాష్ట్రంలో ర‌హ‌దారుల దుస్థితిపై పోరాడుతూనే ఉన్నామ‌ని కానీ అధికార పార్టీ ఇవేవీ ప‌ట్ట‌ని విధంగా నిమ్మ‌కు నీరెత్తిన చందంగా  వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆయ‌న అంటున్నారు.

కార్టూన్ల రూపంలో జ‌న‌సేన త‌న నిర‌స‌న‌ల‌ను తెలుపుతోంది. మ‌రోవైపు జూలై 15 నాటికి రోడ్ల‌పై గుంత‌లు ఉండ‌వ‌ద్ద‌ని, అన్నింటినీ పూడ్చి వేయాల‌ని  వ‌ర్షాలు ఆరంభం అయిన నేప‌థ్యంలో తెర‌చి ఉన్న మ్యాన్ హోల్స్ ఏమ‌యినా ఉంటే వాటిని కూడా మూసివేయాల‌ని చెబుతూ జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు.

కానీ ఈ ఆదేశాల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా అమ‌లు కాలేదు. రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేద్దాం అనుకున్న‌ప్పుడు అస‌ని తుఫాను బెడ‌ద‌తో అప్ప‌ట్లో రాష్ట్రం అత‌లాకుత‌లం అయింద‌ని, ఆ త‌రువాత ప‌నులు చేద్దాం అంటే డ‌బ్బులే లేవ‌ని అధికారులు మ‌రో వాద‌న వినిపిస్తూ  వ‌స్తున్నారు.

మ‌రి ! కేంద్రం విడుద‌ల చేసే ఉపాధి నిధుల‌ను మ‌ళ్లించి సంక్షేమ ప‌థ‌కాల‌కు వెచ్చిస్తున్నప్పుడు, అవే  నిధుల‌ను గ్రామీణ, ప‌ట్ట‌ణ ర‌హ‌దారుల బాగు కోసం ఎందుకు వెచ్చించ‌కూడ‌దు అని ప్ర‌శ్నిస్తోంది విప‌క్షం. నిధుల మ‌ళ్లింపు త‌ప్పే అయినా వాటిని ప‌నికిమాలిన ప‌థ‌కాల కోసం కాకుండా రోడ్ల బాగు కోసం వెచ్చిస్తే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని కూడా ఓ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.
Tags:    

Similar News