పవన్ దెబ్బకు ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అనలేకపోతున్నారట!

Update: 2022-07-17 13:30 GMT
ఏపీలోని రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం ఏదో ఒక రాజకీయ అలజడి రాష్ట్రంలో నడుస్తూనే ఉంటుంది. తిరుగులేని మెజార్టీతో అధికార పక్షం ఉన్నప్పటికి అందుకు ధీటుగా రియాక్టు అయ్యే విపక్షం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీ రాజకీయాలు చూపిస్తున్నాయి. దీనికి తోడు ఏపీ అధికారపక్షం సైతం దూకుడుగా వెళ్లటం.. వివాదాలకు తానే కేరాఫ్ అడ్రస్ గా ఉండే తీరు కూడా ఇప్పుడున్న పరిస్థితికి కారణమన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఏపీలోని రోడ్ల దుస్థితి మీద ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఇదే అంశాన్ని ఎజెండా చేసుకొని జనసేన పార్టీ ఇచ్చిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాం భారీ సక్సెస్ కావటం తెలిసిందే. డిజిటల్ మీడియాను వేదికగా చేసుకొని చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. డిజిటల్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. పవన్ పిలుపు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న వైనం తాజా ప్రోగ్రాంతో ఏపీ అధికారపక్షానికి తెలిసి వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ ప్రోగ్రాం పుణ్యమా అని అధికారపక్ష నేతలకే కాదు.. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే వారికి పెద్ద కష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ మర్యాదపూర్వకంగా పిలిచే మాట.. జనసేన చేపట్టిన క్యాంపైన్ తర్వాత అనలేకపోతునట్లుగా వాపోతున్నారు. రాజకీయం అన్నంతనే తిట్లు.. బూతులు మాట్లాడుకోవటం లాంటి తీరుకు భిన్నంగా ఎలాంటి అసభ్యత లేకుండా చాలా పద్దతిగా ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూనే తాట తీసిన తీరుతో.. ఇప్పుడా మాట ఎవరి నోట రాలేని పరిస్థితి నెలకొందంటున్నారు.

దీంతో.. సీఎం జగన్ ను ఉద్దేశించి గుడ్ మార్నింగ్ సార్ అని అనలేకపోతున్నట్లుగా వాపోతున్నారు. మొత్తానికి తమ ఆందోళనతో.. సీఎం జగన్ కు గుడ్ మార్నింగ్ సార్ అని ధైర్యంగా అనలేని రీతిలో ప్రోగ్రాంను డిజైన్ చేసిన పవన్ ను ఇప్పుడు పదే పదే తలుచుకోవాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. పవన్ పుణ్యమా అని పొద్దు పొద్దున్నే ముఖ్యమంత్రి వారిని ఎలా విష్ చేయాలో అర్థం కాక సీఎంవోలోని వారు చస్తున్నారంటున్నారు.
Tags:    

Similar News