తిరుపతిలో పోటీకి జనసేన ఆసక్తి.. బీజేపీ పరిస్థితేంటి?

Update: 2020-11-16 15:30 GMT
మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఇక్కడ పోటీకి అన్ని పార్టీలూ సై అంటున్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తమ పార్టీ బరిలో ఉంటుందని స్పష్టం చేశాడు. దీంతో ఈ ఉప ఎన్నిక సెగ ఇప్పుడు అన్ని పార్టీలకూ చేరింది. అయితే ఇప్పుడు ఆసక్తి జనసేన అభిప్రాయం ఏంటి? టికెట్‌ ఎవరికి కేటాయిస్తారా అని.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు ఈమధ్య చనిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఉపఎన్నికలు జరపక తప్పదు. అందుకనే ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి పార్టీలు అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నాయి. ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ అందరికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే మిత్రపక్షం జనసేన రూట్ ఎటు అన్నది ఇక్కడ ఆసక్తి రేపుతోంది.

తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడం.. బీజేపీ హిందుత్వ ఎజెండా ఉన్న పార్టీ కావడంతో తాము గెలుపు జెండా ఎగురవేయవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే తిరుమలలో జరిగిన అపచారాలపై బీజేపీ పెద్దఎత్తున ఎలుగెత్తి చాటింది.నానా రచ్చ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా తనదైన లెక్కతో ముందుకు వస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గత చరిత్రను చూస్తే.. తిరుపతిలో బీజేపీ ఒకే ఒక్కసారి గెలిచింది. 1999 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో బీజేపీ గెలిచింది. తిరుపతి ఎంపీగా నందిపాకు వెంకటస్వామి గెలిచారు. దుబ్బాకలో విజయంతో ఇప్పుడు తిరుపతిలో గెలవాలని బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది.

అయితే తిరుపతిలో పోటీపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 16,17వ తేదీల్లో జరిగే జనసేన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తిరుపతిపై తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనసేన సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో నేతలంతా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. తిరుపతిలో పోటీకి జనసేన పట్టుబడితే బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరు రాజీపడుతారు..? సయోధ్య కుదురుతుందా? విభేదాలు తలెత్తితే ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.



Tags:    

Similar News