పవన్ ఒక్క మాట చెప్పేస్తే...రాజకీయ కల్లోలమే...?

Update: 2022-10-29 12:30 GMT
ఏపీలో జనసేన బలం ఎంత, బలగం ఎంత అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారని పవన్ని వైసీపీ వారు నిందిస్తూంటారు. అయితే ఏపీ రాజకీయాలలో గేం చేంజర్ గా జనసేన ఉంది. ఈ సంగతి అందరికీ తెలుసు. పవన్ నోటి వెంట ఒక్క మాట కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఆయన తన పార్టీ పీయేసీ మీటింగ్ మంగళగిరిలో 30న నిర్వహిస్తున్నారు. ఈ భేటీ మీద ఏపీ రాజకీయం మొత్తం ఫోకస్ పెట్టేసింది.

ఎందుకంటే ఈ మధ్యనే చాలా కీలక పరిణామాలు జరిగాయి. విశాఖలో రెండు రోజుల పాటు ఒక హొటల్ లో పవన్ని నిర్బంధించిన ఘటన అయితే ఏపీని కుదిపేసింది. మరో వైపు చూస్తే ఆ మీదట  విజయవాడ వచ్చిన తరువాత జనసేనాని వేగంగా వేసిన అడుగులు ఏపీలో రాజకీయాలను కొంత మార్పునకు గురి చేశాయి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడంతో రెండు పార్టీల మధ్య పొత్తు అన్నది కన్ ఫర్మ్ అని అంతా అనుకుంటున్న పరిస్థితి.

అయితే ఈ విషయం మీద పీయేసీ సమావేశంలో కూలంకషంగా చర్చించిన మీదటనే తుది నిర్ణయం తీసుకోవాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు బీజేపీతో జనసేన సంబంధాలు ఎలా ఉన్నాయన్నది కూడా  కీలకమైన ప్రశ్నగానే ఉంది. తమకు జనసేన మిత్రపక్షమేనని బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నోటి వెంట మాత్రం బీజేపీతో కలసి అడుగులు వేద్దామని అన్న మాట రావడం లేదు.

అయితే బీజేపీతో సంబంధాల మీద కూడా పీయేసీ మీటింగులో చర్చ జరుగుతుంది అని అంటున్నారు. కొంతకాలం వేచి చూసే ధోరణిని బీజేపీ విషయంలో అనుసరిస్తారా లేఅక తమకు మిత్రుడు కాదు అని ఒక్క మాట చెప్పేసి టీడీపీతో కొత్త బంధాలకు తెర తీస్తారా అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నోట ఏ ఒక్క మాట వచ్చినా కూడా అది ఏపీ రాజకీయాలను కల్లోలం చేసి పారేస్తుంది అన్నది నిజం.

పవన్ బీజేపీకి దూరం జరిగితే అది పెద్ద  సంచలనం అవుతుంది. అలా కాకుండా ఆయన మూడు పార్టీలతో జట్టు అన్నా అది కూడా రాజకీయాలను మలుపు తిప్పేదే. టీడీపీతో ఇక రాజకీయ ప్రయాణం అని ఒక్క ముక్క చెప్పినా కూడా ఏపీలో రాజకీయ సునామీయే పుడుతుంది. మరి పీయేసీ సమావేశం పొత్తుల మీద ఏమి తెలుస్తుంది అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News