పవన్ మోసంపై రగిలి.. వైసీపీలోకి..

Update: 2019-03-28 04:15 GMT
జనసేన అడుగులు తడబడుతున్నాయి. సీట్ల విషయంలో నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వలేదనే ఆపవాదు మూటగట్టుకుంటోంది. అందుకే మెగా ఫ్యామిలీనే నమ్ముకొని ఏళ్లుగా  మెగా ఫ్యామిలీ మెంబర్ గా మెదిలిన విశాఖ జిల్లా కు చెందిన చిరంజీవి నమ్మినబంటు ఎం రాఘవరావు వైదొలిగారు. జనసేనాని పవన్ పోకడలకు విసుగుచెంది.. జగన్ సమక్షంలో ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు.

విశాఖపట్నానికి చెందిన ఎం రాఘవరావు మెగా స్టార్ చిరంజీవి అభిమాన నాయకుడిగా వైజాగ్ లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనలోనూ ఈయన కీలక భూమిక పోషించారు. మెగాస్టార్ రక్తదానం - ఐ క్యాంపులు - ఇలా ఏ కార్యక్రమం వైజాగ్ లో చేపట్టినా రాఘవరావే ముందుండి నడిపించేవారు. ప్రజారాజ్యం తరుఫున 2009 ఎన్నికల్లో అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి పోటీచేస్తే మొత్తం ప్రచార బాధ్యతలను ఎం రాఘవరావు మోశాడు. అలాంటి వ్యక్తి పవన్ జనసేన స్థాపించాక కూడా విశాఖపట్నంలో అన్నీ తానై వ్యవహరించాడు.

కానీ ఇప్పుడు టికెట్ల కేటాయింపు వచ్చే సరికి పవన్ కాలదన్నాడు. విశాఖ తూర్పు టికెట్ ను ఆశించిన రాఘవరావును కనీసం పరిశీలనలోకి తీసుకోకుండా బయట నుంచి వచ్చిన నియోజకవర్గానికి సంబంధం లేదని కోన తాతారావుకు కట్టబెట్టారు. ఆదినుంచి పనిచేసుకుంటూ వచ్చిన తనకు పవన్ టికెట్ నిరాకరించడంపై రగిలిపోతున్న రాఘవరావు.. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇలా తరతరాల మెగాభిమాని.. పవన్ వల్ల బయటకురావడం మెగా క్యాంపులో చర్చనీయాంశమైంది. జనసేనలో పరిస్థితిని కళ్లకు కడుతోంది.
   

Tags:    

Similar News