స‌ల‌హాలు వ‌ద్దు.. స‌మ‌స్య‌లు వ‌ద్దు.. ఏంది నాగ‌బాబూ.. ఏం సందేశం ఇస్తున్నావ్‌..!

Update: 2023-05-10 19:00 GMT
" ప‌వ‌న్‌కు ఎవ‌రూ స‌ల‌హాలు చెప్పొద్దు. స‌మ‌స్య‌లు మాకు తెలియ‌వా?  మీకే తెలుసా?  ఇవ‌న్నీ మాకు వ‌దిలేయండి" తాజాగా జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు..సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి. అస‌లు ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన‌లో ప్ర‌శ్న‌ల‌కు తావులేదా? అని నెటిజ‌న్లు న‌వ్వుతున్నారు. నిజానికి పార్టీ అంటేనే.. స‌ల‌హాలు.. సూచ‌న‌లు స్వీక‌రించాలి.

త‌గిన‌సూచ‌న‌లు వ‌స్తే.. త‌గిన స‌ల‌హా వ‌స్తే.. పాటించ‌డం త‌ప్పుకాదు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ ఎవ‌రి స‌ల‌హాలు వినేవారు కాదు. కానీ, రాజ‌కీయాల్లోకి వ‌చ్చినత‌ర్వాత‌..ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఆయ‌న అనేక మెట్లు దిగారు. ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొన్నారు. "నేనేమిటి.. నా స్థాయేమిటి.. అయినా ప్ర‌జ‌ల కోసం.. రోడ్ల వెంబ‌డి తిరిగాను" అని తొలి అసెంబ్లీలో ఆయ‌న చేసిన ప్ర‌సంగం న‌భూతో.. అన్న‌విధంగా సాగింది.

ఈ క్ర‌మంలోనే తూర్పుగోదావ‌రి జిల్లాలో వ‌ర పండుతున్నా.. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు 7 నుంచి 10 రూపాయ‌లు పెట్టి బియ్యం కొనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని గుర్తించిన ఆయ‌న‌.. ఒక‌రి స‌ల‌హా మేర‌కు రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. స‌ల‌హా విని ఉండ‌క‌పోతే.. ఈ ప‌థ‌కం వ‌చ్చేదా?  ఈ విష‌యం రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆచ‌ర‌ణాత్మ‌కం. అయినా.. నాగ‌బాబుకు మాత్రం స‌ల‌హాలు అంటే గిట్ట‌డం లేదు. సూచ‌న‌లు అంటే ప‌డ‌డం లేదు.

ఈ ప‌ద్ధ‌తిలో కొన‌సాగితే.. పార్టీకే అంతిమంగా న‌ష్టం వాటిల్లుతుంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యం. ప్ర‌జ‌లు అనేక క‌ష్టాల్లో ఉన్నారు. ఒక్క‌స‌మ‌స్య‌ను ప‌ట్టుకుని ఎదురీదితే.. జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని..చెబుతున్న పాత్రికేయుల‌పైనా నిప్పులు చెరుగుతుండ‌డం.. నాగ‌బాబుకే చెల్లింది. పార్టీ అనేది ఒక వ్య‌క్తి స్థాపించ‌వ‌చ్చు. అది ఆయ‌న‌కే చెందింది కావొచ్చు.

కానీ, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఎన్నిక‌ల కురుక్షేత్రంలోకి దిగిన త‌ర్వాత‌.. పార్టీకి-ప్ర‌జ‌ల‌తోనూ.. వారి అభిప్రాయాలతోనూ అవినాభ‌వ సంబంధం ఏర్ప‌డుతుంది. ఇది తెలిసిన లాయ‌ర్ నాగ‌బాబు కూడా.. ఇలా.. వ్యాఖ్య‌లు చేయ‌డం స‌మంజ‌స‌మేనా? అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Similar News