భీమిలీని టార్గెట్ చేసిన జనసేన....మాజీ మంత్రిని ఓడించాలనేనట ...?

Update: 2022-11-03 02:30 GMT
విశాఖ జిల్లా భీమునిపట్నం అందమైన ఊరు. అంతే కాదు, రాజకీయంగా కూడా ఇక్కడ పోటీ చేసి గెలవాలని అన్ని పార్టీలు అనుకుంటాయి. ఇక్కడ ప్రజలు సాత్వికులు. అభివృద్ధి తప్ప మరోటి ఆలోచన చేయరు. దానితో పాటు ప్రశాంతత కోరుకుంటారు. అలాంటి భీమిలీ తెలుగుదేశానికి కంచుకోట. 1983 నుంచి వరసగా 1999 ఎన్నికల వరకూ గెలుస్తూ వచ్చింది. 2004లో ఆ కోటను కాంగ్రెస్ బద్ధలు కొట్టింది. 2009లో ప్రజారాజ్యం భీమిలీలో పాగా వేస్తే 2014 నాటికి మళ్లీ టీడీపీ సీటు దక్కించుకుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలిచి తొలి బోణీ కొట్టింది.

ఇలా భీమిలీ రాజకీయ చరిత్రలో అన్ని పార్టీలకూ చోటు దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నుంచి పోటీ చేసి జెండా ఎగరేయాలని ఉవ్విళ్ళూరుతున్న పార్టీగా జనసేన ఉంది. జనసేనకు భీమిలీలో అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో కేవలం పవన్ చరిష్మాతో బరిలోకి దిగిన పంచకర్ల సందీప్ అనే కొత్త వ్యక్తి ఏకంగా పాతిక వేల ఓట్లను తెచ్చుకుని అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. అది లగాయితూ సందీప్ భీమిలీలో పార్టీని డెవలప్ చేస్తూ వస్తున్నారు.

పొత్తులు ఉన్నా లేకపోయినా తాను పోటీ చేసి భీమిలీ నుంచి ఎమ్మెల్యే కావాలని సందీప్ పంతం పట్టారు. ఇక ఈ మధ్య విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటనల పేరుతో వరసగా జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సందీప్ కూడా ఉన్నారు. ఆయన వారం రోజుల పాటు రిమాండ్ లో ఉండి బయటకు వచ్చారు. దాంతో మరింతగా పవన్ కి దగ్గర అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అని జనసేన వర్గాలు అంటున్నాయి.

ఈ మధ్యన మంగళగిరిలో జరిగిన పార్టీ మీటింగులో పవన్ కళ్యాణ్ నోటా గురించి మాట్లాడుతూ నోటా ఓట్లు తమకు  వచ్చినా పంచకర్ల సందీప్ లాంటి వారు గెలిచే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా సందీప్ పేరుని పవన్ ప్రస్తావించడం బట్టి చూస్తే భీమిలీ నుంచి మరోసారి ఆయన్ని నిలెబెడతారు అని అర్ధమవుతోంది. ఇక పవన్ కోసం పార్టీ కోసం జైలు దాకా వెళ్ళి వచ్చిన నాయకులకు ఈసారి టికెట్ ఖాయమని అంటున్నారు. దాంతో ఈ సీటు విషయంలో తమ్ముళ్లకు పచ్చి వెలక్కాయ పడింది అంటున్నారు.

మరో వైపు భీమిలీలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీ తరఫున ఉన్నారు. ఆయనే 2009 ఎన్నికల్లోగా ప్రజారాజ్యం నుంచి భీమిలి పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత టీడీపీ, ప్రసుతం వైసీపీలో ఉన్నారు. ఆయన మీద పవన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. తన ప్రతీ మీటింగులో అవంతి చేమంతి  పూబంతి అని పవన్ సెటైర్లు కూడా వేస్తూ వచ్చారు. అందుకే కోరి మరీ ఈ సీటుని తీసుకుని మాజీ మంత్రిని ఓడించాలనుకుంటున్నారుట.

నిజానికి టీడీపీ అధినాయకత్వం కూడా భీమిలీ సీటు విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులతోనే కధ నడిపిస్తోంది. ఈ సీటు మీద కన్ను ఉన్నా కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఇంచార్జిని చేయలేదు. అంటే జనసేనతో పొత్తులో ఈ సీటు ఇవ్వడానికే టీడీపీ ఇలా దిగ్గజ నేతలను పక్కన పెట్టేసింది అని అంటున్నారు. భీమిలీ ఇంచార్జిగా మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబు ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

అలాగే మత్స్యకార సామాజిక వర్గం నేత  గంటా నూకరాజుకు కూడా ఈ సీటు మీద కన్ను ఉంది. అయితే చంద్రబాబు వీరిని ఎలాగోలా మ్యానేజ్ చేసి అయినా జనసేనకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ జిల్లాలో హాట్ ఫేవరేట్ సీటులో ఈసారి జనసేన పోటీ చేసి గెలవాలని చూస్తోంది. 2009లో ప్రజారాజ్యం విజయం సాధించిన భీమిలీలో 2024లో జనసేన జెండా ఎగురుతుందని ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News