సుపారీ గ్యాంగులు...పవన్ ఎన్ని సార్లు అంటున్నా...?

Update: 2023-06-25 09:00 GMT
పవన్ కళ్యాణ్ అత్యధిక జనాదరణ ఉన్న నటుడు. రాజకీయాల్లో కూడా ఆయన జనసేన స్థాపించి జనాలను తన సభలకు రప్పించుకుంటున్నారు. ఇక పవన్ కి ప్రాణ భయం ఉంది అని అంటున్నారు. ఆ మాటను ఆయన 2019 ఎన్నికల వేళ అన్నారు. మధ్యలో నాలుగేళ్ల కాలం తరువాత మళ్లీ అంటున్నారు. పవన్ని ప్రత్యర్ధులు ఒక్క మాట అన్నా  ఆయన అభిమానులు అసలు ఊరుకోరు. అదే టైం లో ఆయన ఇటీవల కాలంలో సుపారీ గ్యాంగులు తన  మీద దాడి చేయడానికి తిరుగుతున్నాయి వరసబెట్టి అంటున్నారు.

అయితే దాని మీద జనాల్లో స్పందన ఏంటి అన్న చర్చ సాగుతోంది. పవన్ కి అభిమాన సముద్రమే ఉంది. అలాంటి అభిమానులు పవన్ని ఏమైనా చేస్తే ఊరుకుంటారా. ఇది సగటు జనంలో ఉన్న అభిప్రాయం. ఇక అభిమానులలో ఉన్న భావన ఏంటి అంటే పవన్ దేవుడు. ఆయనకు ప్రమాదం తలపెట్టగల సాహసం ఎవరు చేయగలరు. ఇక రాజకీయ వర్గాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయంటే వైసీపీ నేతలే ముందుగా రియాక్ట్ అయ్యారు.

వైసీపీ మంత్రులు అయితే పవన్ కి ముప్పు ఉంటే అది చంద్రబాబు నుంచే అంటున్నారు. అయినా పవన్ ఊరికే ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపించాలని అంటున్నారు. పవన్ వారాహి యాత్ర సందర్భంగా చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు కాస్తా గట్టిగా చెప్పాలీ అంటే పెద్దగా వైరల్ అయితే కాలేదు. ఇంతలా మీడియా విస్తృతం అయిన వేళ కూడా పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ తనకు ప్రాణహాని అని చెప్పినా ఎందుకు పూర్తి స్థాయిలో స్పందన రావడం లేదు అంటే పవన్ కి సొంత సెక్యూరిటీ ఉంది.

అదే విధంగా ఆయన అభిమానులే కొండలా ఉంటారు. పైగా ఈ మాటను ఆయన గతంలో కూడా అని ఉన్నారు. దాంతో పవన్ విషయంలో మొదట్లో కనిపించిన సీరియస్ నెస్ ఇపుడు కనిపించడంలేదు అంటున్నారు. అయినా పవన్ పదే పదే అదే మాట అంటే సింపతీ కోసం అని వైసీపీ నేతల నుంచి జవాబు వస్తోంది.

అసలు ఏపీ రాజకీయాల్లో హత్యా కాండ అయితే లేదు. అపుడెపుడో వంగవీటి మోహనరంగా దారుణ హత్య అయితే ఒకటి జరిగింది. అది ఎన్నికలకు చాణ్ణాళ్ళ ముందే జరిగింది. పైగా ఆ హత్యకు లోకల్ పాలిటిక్స్ కూడా కారణం అని చెబుతారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన కోసం సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయని చెబుతున్నారు.

రాజోలులో కొందరు తనపైన దాడికి ప్రయత్నించారని ఆయన చెబుతున్నారు. దాడి చేసేందుకు తన కోసం నలుగురు రాళ్ళు పట్టుకుని తిరిగారు అని పవన్ అంటున్నారు. నిజంగా పవన్ కి అలాంటి అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. తన రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఏపీ ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అయినా కోరవచ్చు. ఏది ఏమైనా ప్రాణ హాని తలపెట్టాలనుకోవడం ఎవరికైనా తగని పని. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పవన్ అంటున్న మాటలను లైట్ తీసుకోకుండా వాస్తవాలను గమనించాలి.

Similar News