ఆ మంత్రి ఇలాకాలో జనసేనాని టూర్‌.. హీట్‌ పెంచుతోందా!

Update: 2022-12-15 07:48 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. ఓవైపు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాలను పవన్‌ చుట్టేశారు. మరోవైపు ఆయా జిల్లాల ముఖ్య పట్టణాల్లో జనవాణి పేరుతో ఓ కార్యక్రమం కూడా పవన్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజల నుంచి వారి సమస్యలపై స్వయంగా పవన్‌ కల్యాణ్‌ అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.

మరోవైపు జనవరి 12 శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభను పవన్‌ కల్యాణ్‌ నిర్వహించనున్నారు. సంకాంత్రి తర్వాత పవన్‌ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రమంతా పర్యటించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

కాగా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పవన్‌ కల్యాణ్‌.. కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరు జిల్లాల్లో లక్ష రూపాయల చొప్పున కౌలు రైతుల కుటుంబీకులకు పవన్‌ ఆర్థిక సాయం చేశారు.

ఈ నేపథ్యంలో ఈసారి కౌలు రైతు భరోసా యాత్రను సత్తెనపల్లిలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లికి వైసీపీలో మంచి వాయిస్‌ ఉన్న నేతగా ఉన్న అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంబటి ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసేవారిలో అంబటి రాంబాబు ఒకరు.

పవన్‌ సైతం పలుమార్లు అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గంట, అరగంట అంటూ గతంలో ఓ మహిళలో అంబటి రాంబాబు మాట్లాడిన ఆడియో కాల్‌ ఒకటి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించి అంబటిపై పవన్‌ సెటైర్లు పేల్చారు.

మరోవైపు అంబటి రాంబాబు సైతం పవన్‌ కల్యాణ్‌ ముమ్మూటికీ ప్యాకేజీ స్టారే అంటూ గత ఎన్నికల సమయం నుంచి చేస్తున్న పాత విమర్శనే మళ్లీ మళ్లీ చేస్తూ వస్తున్నారు. నిత్యం పవన్‌ పై ఏదో ఒక ట్వీట్‌ ద్వారా అంబటి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జనసేన కౌలు రైతు భరోసా యాత్రను సత్తెనపల్లిలో నిర్వహిస్తుండటం ఆసక్తి రేపుతోంది.

వాస్తవానికి గత ఎన్నికల సమయంలో పవన్‌ అభిమానులను, కాపు సామాజికవర్గానికి చెందినవారిని అంబటి రాంబాబు ప్రాధేయపడి ఓట్లేయించుకున్న వీడియోలు హల్‌చల్‌ చేశాయి. తనకు, పవన్‌ కు సత్సంబంధాలు ఉన్నాయని, చిరు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ సమయంలో అంబటి రాంబాబు చెప్పుకున్నారు.

సత్తెనపల్లిలో గత ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కోడెల శివప్రసాద్‌ రావుకు ఓటేయడం ఇష్టం లేని పవన్‌ అభిమానులు అంబటికి ఓటేశారు. అయతే గెలిచిన తర్వాత పవన్‌ పై విమర్శలు చేయడాన్ని పవన్‌ అభిమానులు హర్షించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి అంబటికి షాక్‌ ఇవ్వాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు ఓటర్లు 35 వేలకు పైగా ఉన్నారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు పర్యటిస్తున్నప్పుడు కొందరు జనసేన కార్యకర్తలు వివిధ అంశాలపై అంబటిని నిలదీశారు.

ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఇలాకా అయిన సత్తెనపల్లిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఆసక్తి రేపుతోంది. డిసెంబర్‌ 18న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడ్డ 268 కౌలు రైతుల తరఫున వారి కుటుంబీకులకు లక్ష రూపాయల చొప్పున పవన్‌ ఆర్థిక సాయం చేస్తారని జనసేన పార్టీ తెలిపింది.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనను ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంబటి రాంబాబుకు తమ సత్తా తెలిసేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని పవన్‌ కల్యాణ్‌ మాటల తూటాలు పేల్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు సత్తెనపల్లి వేదికగానే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వంటి నేతలు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి హీట్‌ ఎక్కుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News