జగన్ సై అంటే పవన్ రెడీ... ?

Update: 2021-11-03 12:30 GMT
అవును. ఇది నిజమే అంటున్నారు అంతా. జగన్ నుంచే ఇపుడు రియాక్షన్ రావాలి. అపుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు చాలా కనిపిస్తాయి. ఇదంతా ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకుంటే జగనే నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్ళాలని పవన్ కూడా కోరుతున్నారు. అంటే జగన్ నాయకత్వంలో అఖిలపక్షం తరఫున తాను కూడా ఢిల్లీ వస్తానని పవన్ చెప్పినట్లుగా భావించవచ్చు. దీనినే మరో మాటగా చెప్పుకోవాలంటే మాత్రం జగన్ తో కలసి హస్తిన వైపుగా అడుగులు వేస్తానని పవన్ అంటున్నట్లుగా అనుకోవాలి.

నిజానికి జనసేన సోలోగా స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేస్తుందని అంతా అనుకున్నారుట. ఈ విషయంలో ఒకనాడు జనసేనలో పనిచేసి ఆ పార్టీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా బరిలో నిలిచిన జేడీ లక్ష్మీ నారాయణ కూడా భావించారుట. అయితే పవన్ మాత్రం అలా కాకుండా అఖిల పక్షం అంటున్నారు. అందరం కలసి వెళ్లాలని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ ఎంచుకున్న ఈ మార్గం కూడా  కరెక్టే అని జేడీ అంటున్నారు.

అయితే ఈ మార్గంలో అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని కూడా జేడీ చెబుతున్నారు. ఇది పార్టీలను రాజకీయాలను దాటి ఆలోచించాల్సిన విషయం అని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే కేంద్రం చేతిలోనే స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. కానీ వత్తిడి పెంచాల్సింది ఏపీ సర్కారే అన్నది పవన్ మార్క్ పాయింట్ గా ఉంది. ఆ విధంగా ఆయన వైసీపీని కార్నర్ చేస్తున్నారు. అయితే ఇది కూడా కరెక్టే అని జేడీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు.

ఇక్కడ అంతా ఆలోచించాల్సింది రాష్ట్రం గురించి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించే తప్ప మరోటి కానే కాదని ఆయన అంటున్నారు. ఇంకో వైపు చూసుకుంటే జగన్ కనుక లీడ్ తీసుకుని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తే కచ్చితంగా చంద్రబాబు, జగన్ రావాల్సి ఉంటుంది. మరి అపుడు జగన్ నాయకత్వంలోనే వీరంతా కేంద్రం వద్దకు వెళ్లాలి. అంటే జగన్ సై అంటే పవన్ రెడీయేనా అన్న చర్చ కూడా వస్తోంది. ఇంతా చేసి జనసేన తరఫున తాను కాకుండా ఏ నాదెండ్ల మనోహర్ నో పవన్, ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ని చంద్రబాబు పంపిస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మేము ముగ్గురం ఒకే ఇష్యూ మీద  కలసి ఉన్నామని వీరంతా చెప్పగలిగినపుడు, కలసి వెళ్లినపుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ సమస్య సాల్వ్ అవుతుంది అని మేధావులు అంటున్నారు.
Tags:    

Similar News