జనతా కర్ఫ్యూ అప్ డేట్.. రేపు సర్వం.. సకలం బంద్

Update: 2020-03-21 10:22 GMT
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం భారతదేశమంతా మూగబోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22వ తేదీన భారతదేశంలో అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాక.. గుజరాత్ నుంచి నాగాలాండ్ దాక అన్నీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ జనతా కర్ఫ్యూ ప్రపంచ దేశాలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే అన్ని సంస్థలు, కార్యాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలు మూసివేశారు. అయితే ప్రజా రవాణా కూడా ఆదివారం నిలిచిపోనుంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికి పరిమితం అవ్వాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ప్రజా రవాణా నిలిచిపోనుంది. జల, వాయు, రోడ్డు మార్గాలన్నీ నిర్మానుష్యం కానున్నాయి. ఎందుకంటే వాటి సిబ్బంది కూడా జనతా కర్ఫ్యూలో పాల్గొనాల్సి ఉండడంతో ఈ మేరకు భారత ప్రభుత్వం ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు భారత రైల్వే సంస్థ ప్రకటించింది. ఇక తమ తమ రాష్ట్రాల్లో ప్రజా రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా వైరస్ కట్టడికి తమవంతు సహకారం అందించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు మొత్తం రవాణా వ్యవస్థ ఆదివారం నిలిచిపోనుంది. రోడ్లపై ఒక్క వాహనం కూడా కనిపించకపోవచ్చు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఆర్టీసీ సేవలు నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రకటించగా.. తెలంగాణలో కూడా నిలిపివేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకు వాటిని ఆపివేయనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్ లో 121 ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా ఆపేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసులు నిలిచివేస్తున్నారు. మొత్తానికి ప్రజలు బయటకు రాకుండా ఆయా సంస్థలు, శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక వ్యక్తిగత వాహనాలు ఉన్న ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం కావాల్సిన సరుకులు, వస్తువులు శనివారమే తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో ఆదివారమంతా ఇంటికి పరిమితమవ్వాలని స్వీయ గృహ నిర్బంధం చేసుకోనున్నారు.
Tags:    

Similar News