రీల్ ‘మల్లీశ్వరి’ స్టోరీ గుర్తుకొచ్చేలా చేసే జపాన్ రాకుమారి లవ్

Update: 2021-09-03 03:30 GMT
వెంకటేశ్.. కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘మల్లీశ్వరి’ మూవీ గుర్తుందా? ఎన్నిసార్లు చూసినా.. టీవీ చానల్ లో వస్తుందంటే.. రిమోట్ ను కాస్త పక్కన పెట్టేసి.. ఆ సినిమాలో లీనం కావటం ఆ మూవీ ప్రత్యేకత. ఒక రాకుమారిని.. ఆమె ఫలానా అన్నది తెలీకుండానే ఒక బ్యాంకు చిరుద్యోగి ప్రేమించటం.. చివరకు తనకొచ్చే వేలాది కోట్లను వదులుకొని అతడితో వచ్చేందుకు సిద్ధమయ్యే ఈ రీల్ స్టోరీకి ఇంచుమించు దగ్గరగా ఉండే రియల్ స్టోరీగా చెప్పాలి.

ఆ సినిమాలోని క్రైం యాంగిల్.. యాక్షన్ సీక్వెన్స్ ను పక్కన పెడితే.. ప్రేమించినోడి కోసం రాచరిక హోదాను వదిలేసుకునే జపాన్ రాకుమారి ఉదంతం తెలిసిందే. తాజాగా ఆమె కష్టం ఫలించి..ప్రేమకథ పెళ్లి పుస్తకంలోకి మారనుంది. దీనికి సంబంధించిన కీలక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. జపాన్ రాకుమారి మకో మరో.. తాను చదువుతున్నకాలేజీలో ఒక సామాన్యుడ్ని ప్రేమించటం.. వారి ప్రేమకు రాచకుంటుంబం అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఎన్నో ప్రయత్నాలు.. పోరాటాల అనంతరం.. కుటుంబ సభ్యుల్ని ఒప్పించి.. పెళ్లి వేడుకకు ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తున్నా.. పట్టువదలకుండా ప్రేమించినోడ్ని పెళ్లాడేందుకు ఆమె ప్రదర్శించిన పట్టుదల ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పాలి.

జపాన్ రాచరిక నిబంధనల ప్రకారం సామాన్యుడ్ని పెళ్లిడిన పక్షంలో రాజకుమారికి రాచరికం హోదా ఉండదని చెప్పినా వెనక్కి అడుగు వేయలేదు. అంతేకాదు.. తాజాగా మరో సాహసానికి తెర తీసి సంచలనంగా మారారు. సంప్రదాయం ప్రకారం జపాన్ రాచరిక కుటుంబంలోని వారు సామాన్యుడ్ని పెళ్లి చేసుకుంటే వారికి భారీ మొత్తాన్ని ఇస్తారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.8.77 కోట్ల మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆ మొత్తాన్ని తీసుకోవటానికి జపాన్ రాకుమారి నో అని తేల్చేశారు.

29 ఏళ్ల మకో కుటుంబ సభ్యుల అనుమతితో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడేందుకు అనుమతి పొందటం ఒక ఎత్తు అయితే.. వారు చూపిన ఇబ్బందుల్ని.. ఓకే అంటూ స్వీకరించటం మరో ఎత్తు. అంతేకాదు.. త్వరలో పెళ్లికి ఓకే చెప్పిన నేపథ్యంలో వారి వివాహం గతంలో అనుకున్నట్లు కాక.. త్వరలోనే అవుతుందని చెబుతున్నారు. పెళ్లి అనంతరం ఆమె తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం యూఎస్ లో లా చదువుతున్న మకో.. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్ని దోచుకుంటున్నారు. ఈ ఉదంతాన్ని చూస్తే రీల్ మల్లీశ్వరిలు రియల్ గా కూడా ఉన్నారనిపించకమానదు.
Tags:    

Similar News