హర్యానా.. అగ్నిగుండంగా మారిపోయింది

Update: 2016-02-20 05:05 GMT
కులాల లొల్లి ఎంత తీవ్రరూపం దాలుస్తుంది? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయం తాజాగా హర్యానాలోని పరిస్థితుల్ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. కులాల రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర రూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఈ మధ్యనే ఏపీలోని తునిలో అందరూ చూసిందే. ఆ ఘటనలకే ఏపీ సర్కారు కిందామీదా పడిపోతే.. హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళన ఎలాంటి రూపు దాల్చిందో తెలిస్తే వణికిపోవటం ఖాయం. రిజర్వేషన్ల కోసం జాట్లు చేస్తున్న తాజా ఆందోళనతో హర్యానా అగ్నిగుండంగా మారిపోయింది.

ఆ బుజ్జి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పరిస్థితుల్ని కంట్రోల్ చేసేందుకు సైన్యాన్ని మొహరించారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. రెండు జిల్లాల్లో అయితే కర్ఫ్యూ విధించటమే కాదు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల్ని జారీ చేశారు. తాజా పరిణామాలతో హర్యానాలోని అధికార బీజేపీ సర్కారు వణికిపోతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టింది.

శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసారూపు దాల్చటమేకాదు.. ఊహించని పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆందోళకారుల ధాటికి రోహతక్ లోని ఆర్థికమంత్రి ఇంటితో పాటు.. మరో బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు దగ్థం చేసేశారు. ఇక.. ప్రభుత్వ కార్యాలయాలు.. వాహనాల్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. రెండు టోల్ ప్లాజాలు ధ్వంసం చేయటంతోపాటు.. ఒక షాపింగ్ మాల్ ను తగలబెట్టేశారు. ఇక.. హైవే మీద వెళుతున్న వాహనాల టైర్లలో గాలి తీసేయటం ద్వారా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయేలా చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఢిల్లీ.. అంబాలా జాతీయ రహదారి తొలిసారి మూతపడిన దుస్థితి. పానిపట్ జిల్లాలోని పలు రైళ్లను రద్దు చేశారు. బస్సు సర్వీసులతో పాటు.. మొబైల్.. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.

జాట్ల రిజర్వేషన్లపై ఒక పరిష్కారం కనుగొంటామంటూ ముఖ్యమంత్రి ప్రకటన జారీ చేసిన తర్వాత కూడా ఉద్రిక్తత చల్లారకపోవటం సరి కదా.. మరింత ముదిరిపోయింది. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ.. హింస తగ్గకపోవటం సరికదా మరింత పెరగటం గమనార్హం.

మరోవైపు.. ఈ విషయంపై ఆందోళన చేస్తున్న అఖిల భారత జాట్ రిజర్వేషన్ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలలో ఒకరు మృతి చెందగా.. 25 మంది గాయాల పాలయ్యారు.
Tags:    

Similar News