బాల్కనీలో ఉండగా.. క్షిపణితో దాడి చేసి.. కుటుంబానికి నష్టం లేకుండా.. జవహరి హత్య

Update: 2022-08-02 08:48 GMT
భార్య బిడ్డలు ఇంట్లో ఉన్నారు.. ఆయనేమో బాల్కనీలోకి వచ్చారు.. ఇంతలోనే ఎక్కడినుంచో దూసుకొచ్చాయి రెండు రాకాసి క్షిపణులు.. అంతే.. క్షణాల్లో ఆయన ప్రాణం పోయింది.అంతేకాదు.. ఆయన ఇంట్లో ఉన్న భార్య, పిల్లలకు ఎవరికీ కించిత్ నష్టం కూడా జరుగలేదు. అంతా క్షణాల్లో అయిపోయింది. ప్రపంచాన్ని భయపెట్టిన అగ్ర ఉగ్రవాది కథ ఇలా ముగిసిపోయింది.. ఇదీ.. అల్ ఖైదా అధినేత అల్ జవహరిని అమెరికా హతమార్చిన విధానం.

లాడెన్ ను చంపినట్లే.. చకచకా..

అది పాకిస్థాన్ లోని అబోత్తాబాద్.. 2011 మే 2.. చిమ్మచీకటి వేళ సుశిక్షిత అమెరిన్ నేవీ సీల్స్ ఓ భవనంపైకి దిగాయి.. వారికితోడుగా జాగిలాలు.. నేవీ సీల్స్ తో పాటే భవనం లోపలికి దూసుకెళ్లాయి. అమెరికా పదేళ్లుగా వెంటాడుతున్న ఆల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ను కాల్చిపారేశాయి. అతడి డెడ్ బాడీని ఎత్తుకెళ్లిపోయాయి. అనంతరం కాల్చి వేసి ఆ బూడిదను సముద్రంలో పడేశాయి. నాడు అంతా చకచకా జరిగిపోయింది. మిగతా ప్రపంచానికి పని పూర్తయ్యాక కాని విషయం తెలియలేదు. ఇప్పుడూ అంతే జవహరిని అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో చేపట్టిన డ్రోన్‌ దాడిలో హతమార్చాయి. అఫ్గాన్‌ టైం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్‌ చేపట్టగా.. దీని వివరాలను అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ సోమవారం రాత్రి వెల్లడించారు.

అమెరికాకు హాని కలిగించాలనుకునేవారు ఎక్కడ నక్కినా, ఎంత కాలమైనా వారిని పట్టుకుని మట్టుబెడతామని బైడెన్‌ వ్యాఖ్యానించారు. జవహరీ కాబుల్‌లోని తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా.. రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులు అతడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో జవహరీ ఒక్కడే హతమవ్వగా.. అదే ఇంట్లో ఉన్న అతడి భార్య, కుమార్తెలు, మనవళ్లు అంతా సురక్షితంగా ఉండడం గమనార్హం. ప్రపంచంలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకడు. లాడెన్‌ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ చేపట్టాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల ఘటనలో లాడెన్‌తో పాటు ఇతడు కూడా ప్రధాన సూత్రధారి. అతడిపై అమెరికా 25 మిలియన్‌ డాలర్ల రివార్డు కూడా గతంలో ప్రకటించింది. అంటే.. ఒక్క ఇతర వ్యక్తికీ ప్రాణ నష్టం లేకుండా జవహరీని కౌంటర్‌ టెర్రరిజం నిపుణులు మట్టుబెట్టారు.

నాడు ఒబామా హయాంలో.. నేడు బైడెన్ జమానాలో

లాడెన్ ను హతమార్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇప్పుడు అధ్యక్షుడు బైడెన్. అప్పట్లో బైడెన్ ఉపాధ్యక్షుడు కావడం గమనార్హం. కాగా, జవహరీని హతమార్చడాన్ని ఒబామా ప్రశంసించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత 9/11 సూత్రధారికి ఎట్టకేలకు శిక్ష పడిందని అన్నారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని తమొందించడం సాధ్యమే అనడానికి ఈ ఆపరేషన్‌ నిదర్శనమని తెలిపారు.

ఈ ఆపరేషన్ కోసం దశాబ్దాలుగా పనిచేసిన అధికారులను కొనియాడారు.  అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి యుద్ధం చేయకుండానే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యమే అని చెప్పేందుకు ఈ ఆపరేషనే నిదర్శనం. అల్‌ఖైదా కారణంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నవారికి, 9/11 మృతుల కుటుంబాలకు ఈ వార్త ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నా అని ఒబామా పేర్కొన్నారు.

ఏమిటీ హెల్ ఫైర్ క్షిపణులు..

జవహరిని హతమార్చినవి హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులు. వీటినే నింజా బాంబులు అంటారు. వీటికో అరుదైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఇతర వ్యక్తుల ప్రాణాలకు ఎటువంటి నష్టమూ లేకుండా.. కేవలం అమెరికా లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద నాయకులను హతమార్చడం దీని విశిష్ట. అందుకే ఉగ్రవాద నాయకుల హత్యకు అమెరికా వీటిని ఆయుధాలుగా వాడుకుంటోంది. 2017 మార్చిలో ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు అబు అల్ ఖ్యార్ ఆల్ మస్రీని వీటితోనే హతమార్చారు. ఆకాశంలోంచి భూమ్మీదకు ప్రయోగించే ఈ క్షిపణులు లేజర్ గైడెడ్. సబ్ సోనిక్ క్షిపణులు. యాంటీ ట్యాంక్ సామర్థ్యం వీటి మరో ఘనత.
Tags:    

Similar News