అమ్మకోసం..మరో విదేశీ వైద్యులు, ఐటీ డెక్స్!

Update: 2016-10-16 05:00 GMT
అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోసం లండన్ కు చెందిన ప్రత్యేక వైద్యులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో విదేశీ వైద్యులు అమ్మకోసం రానున్నారని సమాచారం. అయితే ఆ ఇద్దరు ఫిజియో థెరపీకి సంబందించిన వారు. వస్తోన్న కథనాల ప్రకారం జయలలితకు ఫిజియో థెరపీ చేసేందుకు సింగపూర్‌ వైద్య నిపుణులు రానున్నారు. క్వీన్‌ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు చెన్నై చేరుకోనున్నారు. వీరు జయకు అందించే చికిత్సను పర్యవేక్షిస్తారు.

మరోవైపు నాలుగురు రోజులుగా అమ్మ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ ను విడుదల చేయలేదు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇదే క్రమంలో జయ ఆరోగ్యంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ ను కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ క్రమంలో హెల్త్ బులెటిన్ లు వచ్చినా రాకున్నా, అవి చెప్పే విషయాలు లేక అమ్మను పరామర్శించిన వారు చెప్పే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియా వేదికగా గాసిప్పులు సృష్టిస్తే సీరియస్ గా రియాక్ట్ అవుతామని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే ప్రకటించగా... ఈ విషయమై తాజాగా ఒక ఐటీ సెల్ ఏర్పాటుచేశారు.

సీఎం చనిపోయారని కొందరు - ఆమె బతికే అవకాశాలు లేవని మరికొందరు, ఆమె మరణించి చాలా రోజులు అయ్యిందని ఇంకొందరు వ్యక్తులు సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్ - ట్విట్టర్ - వాట్సాప్ తో పాటుగా యూట్యూబ్ లో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ విషయంలో ఆకతాయిలనే కాకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రోజుకు మూడు షిఫ్ట్ లు చేస్తూ, మొత్తం 24 గంటలు ఇదే పని చేసే విదంగా, అమ్మ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు ప్రచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేసే విధంగా ఈ డెస్కును ఏర్పాటుచేశారు. కాగా, ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు దాదాపు 50 కేసులు నమోదు చేశారని, వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News