రోత పుట్టిస్తున్న ‘‘అమ్మ’’ భక్తి

Update: 2015-12-06 05:05 GMT
‘వ్యక్తిపూజ’ వీర లెవెల్లో ఉండే తమిళనాడులో అధికారపక్షమైన అన్నాడీఎంకే కార్యకర్తల ‘అమ్మ భక్తి’ ఇప్పుడు రోత పుట్టిస్తోంది. ఎప్పుడేం చేయాలన్న విషయాన్ని మర్చిపోయి అమ్మ మీదున్న భక్తిని ప్రదర్శించటం కోసం వారు వేస్తున్న వేషాలపై తమిళ ప్రజలు మండిపడుతున్నారు. భారీ వర్షాలతో విరుచుకుపడ్డ వరద కారణంగా చెన్నైలోని లక్షలాది మంది తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. తినేందుకు కూసింత తిండి లేక.. తాగేందుకు నీళ్లు దొరక్క జనం పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు.

పుట్టెడు కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయటానికి శ్రమించటం పోయి.. ఆపన్న హస్తం అందించేందుకు వచ్చి వారిపై ఆంక్షలు విధిస్తున్నారు. బాధితులకు సాయం అందించేందుకు ఆహారం.. నీళ్లు.. ఇలా తీసుకొచ్చిన వారిని.. వాటిపై ముఖ్యమంత్రి జయలలిత బొమ్మ వేయాలంటూ.. స్టిక్కర్లు అతికించాలంటూ పట్టుపడుతున్నారు.

ఆపదలో ఆదుకునేందుకు వచ్చిన వారిపై అన్నాడీఎంకే నేతలు ప్రదర్శిస్తున్న తీరుపై తీవ్ర మండిపాటు వ్యక్తమవుతోంది. సాయం చేసేందుకు పెద్ద మనసుతో వచ్చిన వారికి మర్యాద ఇవ్వటం పోయి.. తమ ‘అమ్మ’ బొమ్మ అతికించాలంటూ పెడుతున్న ఆంక్షలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అభిమానం ఉండటంలో తప్పు లేదు. కానీ.. దాన్ని ఏ సమయంలో ప్రదర్శించాలన్న ఇంగితం అన్నాడీఎంకే కార్యకర్తలకు లేకపోవటం రోత పుట్టించే వ్యవహారంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News