వైసీపీలోకి జ‌య‌ప్ర‌ద‌!... రాజ‌మండ్రి నుంచి బ‌రిలోకి?

Update: 2019-01-25 10:50 GMT
జ‌య‌ప్ర‌ద‌... సినీ న‌టిగానే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు క‌లిగిన స‌త్తా క‌లిగిన మ‌హిళ‌. తెలుగు, హిందీ సినిమాల్లో న‌ట‌న ద్వారా స‌త్తా చాటిన జ‌య‌ప్ర‌ద‌... న‌టిగా పీక్ స్టేజిలో ఉండ‌గానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ వ్వ‌వ‌స్థాప‌కుడు దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావు పిలుపు మేర‌కు 1994 ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ప్ర‌ద‌... ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్ చేసినా సున్నితంగానే తిర‌స్క‌రించారు. అయితే 1995లో ఎన్టీఆర్‌ కు చంద్ర‌బాబు వెన్నుపోటు నేప‌థ్యంలో మిగిలిన నేత‌ల మాదిరిగానే జ‌య‌ప్ర‌ద కూడా చంద్ర‌బాబు శిబిరంలోనే చేరిపోయారు. ఆ త‌ర్వాత 1996లో టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఎంపికైన జ‌య‌ప్ర‌ద‌... త‌ద‌నంత‌ర కాలంలో టీడీపీకి గుడ్ బై చెప్పి స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన జ‌య‌ప్ర‌ద‌... గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు తెర మీద‌కు వ‌స్తున్న జ‌య‌ప్ర‌ద‌... ఇప్పుడు ఓ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

చంద్ర‌బాబుతో విభేదాల కార‌ణంగానే గ‌తంలో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌య‌ప్ర‌ద‌... తిరిగి ఆ పార్టీలో చేరేందుకు స‌సేమిరా అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ కంటే కూడా బ‌ల‌మైన పార్టీ కోసం చూసిన జ‌య‌ప్ర‌ద‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీ త‌న‌కు స‌రైన పార్టీగా గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే వైఎస్ జ‌గ‌న్ తో జ‌యప్ర‌ద భేటీ కానున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే... రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్ స‌భ స్థానం నుంచి  ఆమె వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగడం ఖాయ‌మేన‌ని స‌మాచారం. జ‌య‌ప్ర‌ద సొంతూరు రాజ‌మ‌హేంద్ర‌వ‌ర‌మే. అంటే ఆమె అక్క‌డ పోటీ చేస్తే లోక‌ల్ కిందే లెక్క అన్న‌మాట‌. అంతేకాకుండా త‌న పాద‌యాత్ర‌లో భాగంగా రాజ‌మ‌హేంద్ర‌వరం ఎంపీ సీటును ఈ ద‌ఫా బీసీల‌కు కేటాయిస్తాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. జ‌య‌ప్ర‌ద కూడా బీసీ సామాజిక వ‌ర్గానికే చెందిన వారు కావ‌డంతో ఇప్పుడు ఈ దిశ‌గా ఆమె అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఇప్పుడు రాజ‌మ‌హేంద్రవ‌రం పార్ల‌మెంటు ఇన్‌ చార్జీగా యువ‌కుడు అయిన మార్గాని భ‌ర‌త్ రామ్ కొన‌సాగుతున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, సినీ న‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్ కొన‌సాగున్నారు. ఆర్థిక ప‌రంగా కూడా బ‌లమైన అభ్య‌ర్థిగా బరిలోకి దిగిన ముర‌ళీ మోహ‌న్ కార‌ణంగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్ స‌భ స్థానంతో పాటు దాని ప‌రిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సీట్ల‌లో ఆరింటిని టీడీపీ గెలుచుకుంది. ఈ లెక్క‌ల‌ను ఓ సారి పరిశీలించిన జ‌గ‌న్‌... ముర‌ళీమోహ‌న్‌ కు ధీటుగా నిల‌బ‌డ‌గ‌లిగే నేత కోసం చూస్తున్నార‌ని స‌మాచారం. జ‌య‌ప్ర‌ద అయితే తాను సూచించిన స‌మాజిక వ‌ర్గంతో పాటుగా మురళీమోహ‌న్‌ ను ఢీకొట్ట‌గలిగే సత్తా క‌లిగిన నేత‌ను నిల‌బెట్టిన‌ట్ట‌వుతుంద‌న్న‌ది జ‌గ‌న్ భావ‌న‌గా తెలుస్తోంది. అంతేకాకుండా జ‌య‌ప్ర‌ద‌ను రాజ‌మ‌హేంద్ర‌వరం నుంచి బ‌రిలోకి దించితే... మొత్తం తూర్పు గోదావ‌రి జిల్లాతో పాటుగా ఆ జిల్లా స‌రిహ‌ద్దు జిల్లాల‌పైనా కొంత మేర ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌న్న‌ది జ‌గ‌న్ భావ‌న‌గా తెల‌స్తోంది. ఈ లెక్క‌ల‌న్నీ వేసుకున్న త‌ర్వాతే త‌న‌తో భేటీకి ఆస‌క్తిగా ఉన్న జ‌య‌ప్ర‌ద‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా టీడీపీకి మంచి ప‌ట్టున్న తూర్పు గోదావ‌రి జిల్లాను త‌న‌వైపున‌కు తిప్పుకునేందుకు జ‌గ‌న్ చేస్తున్న య‌త్నాలు మంచి ఫ‌లితాలిచ్చే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయ‌ని చెప్పాలి.


Tags:    

Similar News