ప్యాకేజీ నాన్సెన్స్.. హోదా అడిగితే దేశద్రోహమా?

Update: 2017-01-30 05:20 GMT
ఆయనకు రాజకీయం చేయటం  కుదర్లేదని చెప్పక తప్పదు. కానీ.. విషయాల పట్ల ఆయనకు ఉన్న అవగాహన అంతాఇంతా కాదు. కాకుంటే నిజాన్ని చెప్పినోడ్ని నమ్మని తెలుగోళ్లకు ఆయన మాటలు పెద్దగా ఎక్కవు. మాస్ కి నచ్చేలా.. వారి మనసుల్ని దోచుకునే మాస్ అప్పీల్ లేనప్పటికీ.. విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటంలోనూ.. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పటంలోనూ లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సాటి వచ్చే వారు ఎవరూ ఉండరనే చెప్పాలి.

సమకాలీనకాలంలో తెలుగువారిలో అత్యంత మేధావిగా.. విషయాల పట్ల అంతులేని పట్టు ఉన్న వ్యక్తుల జాబితాను చేస్తే.. టాప్ ఫైవ్ లో జేపీ పేరు తప్పనిసరిగా ఉంటుంది. లోక్ సత్తా పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పిన మాట ఒక్కటే. రాజకీయం మారనంతవరకూ.. సరిహద్దులు మారినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని. ఆ విషయాన్ని ఇప్పుడు అందరికి అర్థమవుతున్నదే.

ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ కోసం కోట్లాడి.. భారీ ఎత్తున ఉద్యమం చేసిన కోదండం మాష్టారి లాంటోళ్లు సైతం కేసీఆర్ సర్కారు తీరుపై ఎంతగా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారో తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలు చేశారో.. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న వైనం చూసినప్పుడు.. అప్పట్లోనే జేపీ చెప్పిన మాటలు  యధాలాపంగా గుర్తుకు రాక మానదు.

ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జేపీ రియాక్ట్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. ఒక ప్రశ్నను సూటిగా వేశారు. ప్రత్యేక హోదా మీద పోరాడుతున్న వారిని.. ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న చంద్రబాబుకు నోట మాట రాని రీతిలో జేపీ కొన్ని ప్రశ్నల్ని సంధించారు.

‘‘నిన్నటి వరకూ వారుచేసిన వాదన అధికారంలో ఉన్న వారికి నచ్చకపోతే అన్యాయమవుతుందా? ఆంధ్ర్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల క్రితం వరకూ ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబుతో సహా కేంద్రమంత్రులు చెప్పిన మాటల్ని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే దేశద్రోహ చర్య ఎలా అవుతుంది? హోదామాట ఎత్తటమే తప్పు అవుతుందా?పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగటం ఏంది?’’ అంటూ వరుస ప్రశ్నల్ని సంధించారు.

ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టటాన్ని నాన్సెన్స్ గా పేర్కొన్న జేపీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఒరిగే ప్రయోజనాల్ని చెప్పుకొచ్చిన ఆయన.. హోదాతో పన్నురాయితీలు వస్తాయని.. వాటితోనే ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టటానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.హోదా ఉన్న రాష్ట్రానికే పారిశ్రామిక రాయితీలు దక్కిన విషయాన్ని గుర్తు చేశారు.

‘‘పవర్ లో ఉన్న వారికి నచ్చినా.. నచ్చకున్నా ప్రజలు తమ కోరికల సాధన కోసం  నిరసన తెలిపేహక్కు ఉంది. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకూ ఎంతమందైనా గుమిగూడొచ్చు.. ఇవన్నీ ప్రజాస్వామ్య హామీలు. ప్రత్యేక హోదా అడిగితే దేశద్రోహం ఎలా అవుతుంది? ఒకవేళ ప్రత్యేక హోదా అవసరం లేదంటే శ్వేతపత్రం ప్రకటించి.. పన్ను రాయితీ అవసరం లేదు.. ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటి వరకు వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది. అక్రమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుంది?’’ అంటూ తన వాదన వినిపించారు. జేపీ వాదన సమంజసంగా ఉండటమే కాదు.. ఆయన సంధించిన ప్రశ్నలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా సమాధానాలు చెప్పగలరా? అన్నదే ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News