జేపీకి తత్వం బోధపడినట్లుంది

Update: 2016-03-22 08:00 GMT
లోక్‌ సత్తా పార్టీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోదని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ చెప్పారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన అన్నారు. లోక్‌ సత్తాను ఇకపై రాజకీయ పార్టీగా చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
   
రాజకీయాల్లో సరికొత్త లక్ష్యాలతో వచ్చిన లోక్ సత్తా పార్టీ ఎన్నికల పరంగా ఇంతవరకు సాధించేందేమీ లేదు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఒక్కరే ఒకసారి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదికూడా టీడీపీ సహకారంతోనే సాధ్యమైందన్న సంగతి అందరికీ తెలిసిందే.  మొన్నటి ఎన్నికల్లో జేపీ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిపాజిట్టు కూడా సాధించలేకపోయారు. మరోవైపు పార్టీ ముక్కలు ముక్కలై కుక్కలు చింపిన విస్తరిలా మారింది. పార్టీని జాతీయ స్థాయికి విస్తరిస్తానని జేపీ ప్రణాళికలు వేసినా తెలుగు రాష్టాల్లోనూ ఉనికిలో లేకుండా పోయింది. పాత పరిచయాలు - కుల సమీకరణలతో జేపీ ఇంకా మీడియాలో ఆమాత్రం కనిపిస్తున్నారు కాబట్టి లోక్ సత్తా అన్న పేరు ఇంకా వినిపిస్తోంది.  దీంతో జేపీకి ఇక పార్టీకి మనుగడ లేదన్న విషయం బోధపడినట్లుంది. అందుకే పంథా మార్చారు. ఎన్నికలు మనకు సరిపడవని డిసైడయ్యారు.  2006లో లోక్ సత్తాను స్థాపించగా 2016లో ఇప్పుడు కాడి పక్కన పడేసినట్లయింది. మొత్తానికి పదేళ్లలో కుదేలైన లోక్ సత్తా ఇక ఎలా ఉండబోతోందో చూడాలి.
Tags:    

Similar News