జేసీ బ్రదర్స్ రాజకీయం క్లైమ్యాక్స్ కు చేరుకున్నట్లేనా ?

Update: 2020-12-02 04:02 GMT
అనంతపురం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు తమదైన ప్రభావం చూపిన జేసీ బ్రడర్స్ రాజకీయ జీవితం క్లైమ్యాక్సుకు చేరుకున్నదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డోలమైట్, సున్నపురాయి మైనింగ్ కు సంబంధించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న కారణంగా గనుల శాఖ ఉన్నతాధికారులు జేసీ దివాకర్ రెడ్డికి రూ. 100 కోట్ల జరిమానా విధించటం సంచలనంగా మారింది. దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన కారణంగా జేసీల వ్యాపారాల జోలికి ఇన్ని సంవత్సరాల్లో  ఎవరు వెళ్ళలేదు.

అయితే 2019లో జేసీల వారసులిద్దరు ఎన్నికల్లో ఓడిపోవటంతో పాటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో జేసీ బ్రడర్స్ కు కష్టాలు మొదలైంది. ఈ కష్టాలకు మూల కారణం ఏమిటంటే 2014-19 మధ్య వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. అధికారంలో ఉన్నాం కదాని ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెలరేగిపోయారు. జగన్ను మాత్రమే కాకుండా తల్లి విజయమ్మను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. మొత్తం కుటుంబంపై ఎంతంటే అంత నోరు పారేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బ్రదర్స్ ఓవర్ యాక్షన్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో వ్యాపారాల ముసుగులో వాళ్ళు సాగించిన దందాలన్నీ ఒక్కోటిగా బయటపడ్డాయి. ముందగా జేసీ ట్రావెల్స్ అక్రమాలు బయటపడ్డాయి. ట్రావెల్స్ వ్యాపారమంతా అవినీతి, అక్రమాలు, అడ్డదారులే అన్న విషయాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. దాంతో ముందు మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకెళ్ళారు. ట్రావెల్స్ దందా తర్వాత అక్రమ మైనింగ్ విషయాలు బయటపడ్డాయి.

జిల్లాలోని యాడికి మండలంలో డోలమైట్, సున్నపురాయి మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందనే విషయం ఆధారాలతో సహా నిరూపణయ్యింది. 14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేసుకున్నారని బయటపడింది. అందుకనే అధికారులు రూ. 100 కోట్ల జరిమానా విధించారు. కట్టకపోతే రెవిన్యు రికవరీ చట్టం ప్రకారం ఆస్తులను ఎటాచ్ చేసేసుకుంటామని నోటీసులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

జేసీ బ్రదర్స్ అంటేనే నోటి దురుసుకు బ్రాండ్ అంబాసిడర్లనే ముద్రుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైన తమ నోటికి తాళాలు వేసుకునుంటే బాగుండేది. కానీ అలా చేస్తే వాళ్ళు జేసీ బ్రదర్స్ ఎందుకవుతారు ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే బ్రదర్స్ రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు వచ్చేసినట్లే అనిపిస్తోంది.

నిజానికి మొన్నటి ఎన్నికల్లోనే బ్రదర్స్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ వారసులను దింపారు.  ముందు వారసులను నిలిపి వెనుక బ్రదర్స్ షో చేశారు. ఇపుడు తగులుతున్న వరుస దెబ్బల కారణంగా భవిష్యత్తులో అది కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకంటే రాజకీయంగా, ఆర్ధికంగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది
Tags:    

Similar News