జేసీ, ఆదినారాయణ రెడ్డి.. బీజేపీ బాటలో.. ముహూర్తం కూడా ఫిక్స్?!

Update: 2019-06-01 12:51 GMT
అధికారం లేకపోతే నేతలు ఎక్కడా నిలబడలేరు. ప్రత్యేకించి గత కొన్నేళ్లలో రాజకీయ పరిణామాలు అలా తయారు అయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో మళ్లీ రాజకీయ వలసలు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సారి ఏపీలో రాజకీయ వలసలకు, ఫిరాయింపులకు అధికార పార్టీ అంత ఆసక్తి చూపడం లేదు. ఫిరాయింపు రాజకీయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నో చెబుతున్నారు.

జగన్ కు కావాల్సినంత స్థాయిలో ఎమ్మెల్యేలను ఇచ్చారు ఏపీ ప్రజలు. మెజారిటీకి అవసరమైన స్థాయి కన్నా చాలా ఎక్కువ సీట్లను జగన్ కు అప్పగించారు ఓటర్లు.ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేకుండా పోయింది.

గెలిచిన వారితోనే పని లేనప్పుడు, ఓడిపోయిన వారితో జగన్ కు అసలే మాత్రం పని ఉండదని వేరే చెప్పనక్కర్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అలాంటి వలస పక్షులు ఇప్పుడు ఇంకో గూటిని చూసుకుంటున్నాయని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ అధికారం  కోల్పోయిన దశలో టక్కున తెలుగుదశం పార్టీలోకి చేరిన జేసీదివాకర్ రెడ్డి, అదే కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అధికారం సంపాదించుకోలేదని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి.. ఇలాంటి వారందరికీ ఇప్పుడు వలసకు ఒక పార్టీ అవసరం ఏర్పడింది. అది బీజేపీ అని తెలుస్తోంది!

వీళ్లంతా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని, భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. జూన్ పదకొండో తేదీన వీరంతా బీజేపీలోకి చేరబోతున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది!

రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉంది. వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఎలాగూ వీళ్లను చేర్చుకోరు. తెలుగుదేశం పార్టీలో వీరు ఉండలేరు. మళ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రస్తుతానికి వీరు బీజేపీని సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాబట్టి కొన్ని పనులను చేయించుకోవచ్చు, అధికార పార్టీలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు! ఇదీ ఈ వలస పక్షుల ఆలోచనగా తెలుస్తోంది.

    
    
    

Tags:    

Similar News