జేసీ వ‌ర్సెస్‌ పల్లె!... ఏం మాట్లాడుకున్నారో?

Update: 2018-02-21 15:30 GMT
ఏపీలో అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. మొన్న‌టిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి... గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందుగా టీడీపీలో చేరిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి - ఆయ‌న సోద‌రుడు - తాడిప‌త్తి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిలు... నోరు తెరిచారంటే సంచ‌ల‌న వార్త‌లే అవుతున్నాయి. ఇక అనంత‌పురంలో ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలుపెట్టిన అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి - జేసీల మ‌ధ్య వివాదం కూడా ఆ జిల్లా రాజ‌కీయాల‌పై అంద‌రూ మాట్లాడుకునేలా చేసింద‌నే చెప్పాలి. ఇక అటు అసెంబ్లీతో పాటు ఇటు శాస‌న‌మండ‌లిలో కూడా ప్ర‌భుత్వ విప్‌ల ప‌రంగా మెజారిటీ షేర్‌ ను ద‌క్కించుకున్న అనంత‌పురం జిల్లా...  నిజంగానే పొలిటిక‌ల్‌ గా ఆస‌క్తి రేకెత్తించే జిల్లాగానే అంతా ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రో సంచ‌లనాత్మ‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అది కూడా అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య చోటుచేసుకున్న‌దే కావ‌డంతో... అది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. టీడీపీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి - అదే పార్టీ ఎమ్మెల్యేగానే కాకుండా మొన్న‌టిదాకా మంత్రిగా, ఇప్పుడు అసెంబ్లీలో చీఫ్ విప్‌ గా ఉన్న ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిల‌కు సంబంధించిన ఈ వివాదంలో వీరిద్ద‌రి భండారాన్ని బ‌య‌ట‌పెట్టాడ‌న్న కార‌ణంతో ఏకంగా న‌లుగురు వ్య‌క్తుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఇక ఈ వివాదం అస‌లు వివ‌రాల్లోకి వెళితే... ఎంపీగా ఉన్న జేసీ - ఎమ్మెల్యేగా ఉన్న ప‌ల్లెల మ‌ధ్య ఇటీవ‌ల ఓ ఫోన్ సంభాష‌ణ న‌డిచింద‌ట‌. ఈ ఫోన్ సంభాష‌ణ‌ను ఎంపీ - ఎమ్మెల్యేల‌కు తెలియ‌కుండా ర‌హ‌స్యంగా రికార్డు చేసిన ఓ వ్య‌క్తి దానిని ఏకంగా సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. ఈ విష‌యం ఆ నోటా - ఈ నోటా ఎంపీతో పాటు ఎమ్మెల్యేకూ తెలిసిపోయింద‌ట‌. సోషల్ మీడియాలోకి వ‌చ్చేసిన ఈ ఫోన్ సంభాష‌ణ‌ను నెటిజ‌న్లు బాగానే విన‌డంతో పాటుగా త‌మ స్నేహితుల‌కు కూడా షేర్ చేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయినా ఈ ఫోన్ సంభాష‌ణ‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్య‌క్తి ఎవ‌రు? అత‌డి ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ పనికి పాల్ప‌డ్డాడు? అన్న వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉంటూనే.... నిత్యం పాలిటిక్స్ వ్య‌వ‌హారాల్లోకి త‌ల‌దూర్చే త‌త్వ‌మున్న కొండ‌సాని సురేశ్ రెడ్డి అనే వ్య‌క్తి ఈ ఫోన్ సంభాష‌ణ‌ను ర‌హ‌స్యంగా రికార్డు చేయ‌డంతో పాటుగా సోష‌ల్ మీడియాలో పెట్టార‌ట‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వ‌ద్ద ఉంటూనే సురేశ్ రెడ్డి ఈ ఫోన్ సంభాష‌ణ‌ను రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప‌ల్లె... త‌న ప‌రువు - ప్ర‌తిష్ఠ‌ను భంగం వాటిల్లింద‌ని భావించి త‌న అనుచ‌ర గ‌ణాన్ని అప్ర‌మ‌త్తం చేశార‌ట‌. దీంతో ప‌ల్లె అనుచ‌రుడు, టీడీపీ మండ‌ల స్థాయి నేత దామోద‌ర్ రెడ్డి దీనిపై ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ట‌. ఈ ఫిర్యాదును ప‌ట్టుకుని బ‌య‌లుదేరిన ఖాకీలు... సురేశ్ రెడ్డితో పాటుగా మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదు చేశార‌ట‌. అయినా అధికార పార్టీకి చెందిన ఎంపీ - ఎమ్మెల్యేల మధ్య జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలోకి వ‌స్తేనే... త‌న ప‌రువు ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగింద‌న్న కోణంలో ప‌ల్లె భావించారంటే... అస‌లు ఆ ఫోన్ సంభాష‌ణ‌లో వారిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నార‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ న‌డుస్తోంది. వ్య‌వ‌హారం పోలీసుల వ‌ద్ద‌కు చేర‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా నుంచి ఈ ఫోన్ సంభాష‌ణను తొల‌గించేశారు. ఈ ఫోన్ సంభాష‌ణ బ‌య‌ట‌కు రావ‌డంతో త‌న ప‌రువు మంట‌గ‌లిసింద‌ని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి మ‌ద‌న‌ప‌డిపోతున్నారంటే.... ఏదో కీల‌క అంశంపైనే ఎంపీ, ఎమ్మెల్యేలిద్ద‌రూ చ‌ర్చించుకుని ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఆ విష‌యం ఏమిటో చెప్ప‌కుండా... సురేశ్ రెడ్డి చేసిన ప‌ని వ‌ల్ల ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ప‌రువుకు భంగం క‌లిగింద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన దామోద‌ర్ రెడ్డి... సురేశ్ రెడ్డిపై చేసిన విమ‌ర్శ‌లు కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. స‌ర్కారీ ఉద్యోగిగా ఉన్న సురేశ్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమ సంపాదనతో ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టుకున్నారని దామోదర్ నాయుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. అయినా అధికారంలో ఉన్న తాము ఉద్యోగుల అవినీతిని నిలువ‌రించి చ‌ర్య‌లు చేపట్టాల్సింది పోయి... ఎంపీ, ఎమ్మెల్యేల ఫోన్ సంభాష‌ణ‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడ‌న్న కార‌ణంగా ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేయ‌డం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌నే చెప్పాలి. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు అనంత‌పురంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Tags:    

Similar News