చిరునే ప‌వ‌న్‌ కు శాప‌మా?

Update: 2017-11-30 08:36 GMT
ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. వివాదాల్లోకి చిక్కుకోవ‌టం.. అందులో నుంచి మ‌ట్టి అంట‌కుండా బ‌య‌ట‌ప‌డ‌టంలో జేసీ టాలెంటే వేరు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడ‌తార‌న్న పేరుతో మాట్లాడే జేసీ వ్యాఖ్య‌లు కొన్నిసార్లు రాజ‌కీయ సంచ‌ల‌నంగా మార‌తాయి.

పార్ల‌మెంటులో ఏం ఉంది? ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేదు? ఎంపీల‌కు గౌర‌వ‌మే లేకుండా పోయిందంటూ మాట్లాడే జేసీ.. త‌న కొడుకును మాత్రం 2019 ఎన్నిక‌ల బ‌రిలో నిలుపుతాన‌ని చెబుతారు. కాకుంటే.. టికెట్ ఇచ్చే విష‌యంలో అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌య‌మే తుది మాట‌గా చెబుతుంటారు.రాజకీయాల్లో ఏం లేద‌ని.. ఎంపీగా పీకేదేమీ లేద‌ని చెప్పే జేసీ. . మ‌రి త‌న కొడుకును రాజ‌కీయాల్లోకి ఎందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నారో మాత్రం క్లారిటీగా చెప్ప‌రు.

త్వ‌ర‌లో రిటైర్ అవుతాన‌ని చెప్పే జేసీ.. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో పోటీ చేసే ఆలోచ‌న లేద‌ని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో అక్క‌డికి వెళ్లిన ఆయ‌న మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ముచ్చ‌ట మాట‌ల మ‌ధ్య‌న వ‌చ్చింది. ప‌వ‌న్‌ కు ఆయ‌న సోద‌రుడు చిరునే శాపంగా జేసీ అభివ‌ర్ణించారు.

ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టిన చిరు.. కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్ర‌భావం ప‌వ‌న్ మీద ఉందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టిన చిరు.. కాల‌క్ర‌మంలో దాన్ని కాంగ్రెస్‌ లో విలీనం చేసి పొరపాటు  చేశార‌న్నారు.

విత్త‌నాలు వేస్తే స‌రిపోద‌ని.. పంట పండాలి క‌దా అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించిన జేసీ.. చిరు చేసిన పొర‌పాటు ప‌వ‌న్ ను వెంటాడుతుంద‌న్నారు.

ఇక‌.. లోక‌ల్ పాలిటిక్స్ మీద ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలోకి చేర‌నున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాధ‌రెడ్డి ఎపిసోడ్ మీద స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుర్నాథ‌రెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశించ‌టం లేద‌న్నారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి నాయ‌క‌త్వంలో కాదు.. చంద్ర‌బాబు నాయ‌కత్వంలోనే తామంతా ప‌ని చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఈ రోజున రాజ‌కీయాల్లో అంద‌రి మీద ఆరోప‌ణ‌లు వ‌స్తుంటాయ‌ని. వాటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు గుర్నాథ‌రెడ్డికి సంబంధించి మిస్స‌మ్మ బంగ్లా విష‌యం కోర్టులో ఉంద‌ని.. దాని గురించి కోర్టు నిర్ణ‌య‌మే ఫైన‌ల్ గా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News