న‌న్నే ఎక్కించుకోరా.. హైకోర్టుకు జేసీ

Update: 2017-07-12 05:26 GMT
ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీ జేసీకి కోపం వ‌చ్చేసింది. ఇలాంటి కోపంతోనే విశాఖ ఎయిర్ పోర్ట్ లో వీరంగం సృష్టించార‌ని.. ఇండిగో సిబ్బందిపై విరుచుకుప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొని.. విమానయాన సంస్థ‌ల నిషేధానికి గురైన ఆయ‌న‌.. తాజాగా ఇదే అంశంపై హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను విమానాల్లో ఎందుకు ఎక్కించుకోర‌ని ప్ర‌శ్నిస్తూ.. త‌న‌పై విధించిన నిషేధం చ‌ట్ట‌విరుద్ధమ‌ని పేర్కొంటూ జేసీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

త‌న‌పై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను తొల‌గించి.. త‌న‌ను విమానాల్లో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు. జూన్ 16న విశాఖప‌ట్నం విమానాశ్ర‌యంలో నిర్ణీత స‌మ‌యానికి వ‌చ్చినా.. ఆల‌స్యంగా వ‌చ్చానంటూ త‌న‌కు బోర్డింగ్ పాస్ ఇవ్వ‌లేద‌ని.. ఆ స‌మ‌యంలో ఇండిగో సిబ్బందిపై తాను దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా దుష్ప్ర‌చారం చేశార‌న్నారు.

తాను దురుసుగా ప్ర‌వ‌ర్తించి ఉంటే త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌న్నారు. పౌర‌విమాన‌యాన మంత్రి అశోక్  గ‌జ‌ప‌తిరాజు జోక్యంతో త‌న‌కు బోర్డింగ్ పాస్ ఇచ్చిన‌ట్లుగా జేసీ పేర్కొన్నారు. జులై 9 నుంచి తాను ట్రూజెట్ విమానంలో ప్ర‌యాణించేందుకు అనుమ‌తించ‌లేద‌న్నారు. వ‌యోభారం.. అనారోగ్య కార‌ణాల రీత్యా విమానాల్లో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌న్న అంశంపై ఎలాంటి విచార‌ణ చేయ‌లేద‌ని.. త‌న త‌ప్పును నిరూపించ‌కుండానే త‌న‌పై నిషేధం విధించటం ఏమిటంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటీష‌న్ లో ప్ర‌తివాదులుగా  పౌర విమాన‌యాన శాఖ‌తో పాటు డీజేసీఏ.. ఎయిరిండియా.. విస్తారా.. ఇండిగో.. గోఎయిర్‌.. ఎయిర్ ఏషియా.. స్పైస్ జెట్‌.. టుబ్రో మెగా ఎయిర్ వేస్ సంస్థ‌లు చేర్చారు. త‌న‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా త‌న‌పై ట్రావెల్ బ్యాన్ విధించ‌టం స‌రికాద‌ని వాదించారు. వ‌యోభారం.. అనారోగ్యం లాంటి స‌మ‌స్య‌లున్న జేసీ.. ప్రింట‌ర్ ను ఎత్తి ప‌డేయ‌టం ఎలా సాధ్య‌మైంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News