జేసీ మళ్లీ కలకలం సృష్టించారు

Update: 2015-11-29 07:45 GMT
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి సొంత ప్రభుత్వాన్ని మళ్లీ ఇరుకునపెట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న చౌక - ఉచిత పథకాలను ఆయన వ్యతిరేకించారు. వాటివల్ల ప్రభుత్వంపై భారం పడుతోందని.. వాటి అవసరం ఉందో లేదో సమీక్షించుకోవాలన్నారు. ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రూపాయికే కిలో బియ్యం పథకాన్ని తప్పుపట్టారు. బయటకు టీ కూడా రూ.5 కంటే తక్కువకు దొరకడం లేదని.. అలాంటిది, బియ్యం కిలో రూపాయికే ఇవ్వడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. దీంతో సొంత పార్టీ అమలు చేస్తున్న పథకంపైనే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీడీపీలో కలకలం సృష్టించింది.

రూపాయికే కిలో బియ్యం పథకంపై వ్యాఖ్యలు చేసిన జేసీ ఉచిత కరెంటునూ వ్యతిరేకించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తే మేలు జరుగుతుందని జేసీ అభిప్రాయపడ్డారు. అయితే... ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తప్పు పట్టడం జేసే ఉద్దేశం కాకపోవచ్చని... ఆ పథకాల వల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడుతుందన్నదే ఆయన ఆవేదన అని అంటున్నారు. కాగా నిరుపేదలకు వరంలా ఉన్న రూపాయి కిలోబియ్యం పథకంపై జేసీ వ్యాఖ్యలపై ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు జీసీ విమర్శించిన రూపాయి బియ్యం - ఉచిత కరెంటు రెండూ కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ ప్రవేశపెట్టినవి కావడం విశేషం. అప్పటికి కాంగ్రెస్ లోనే ఉన్న జేసీ ఇప్పుడు టీడీపీలో ఉంటూ వాటిని వ్యతిరేకించడంలో ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి.
Tags:    

Similar News