జేసీ - పోలీస్.. ఓ ప్రభోదానంద..

Update: 2018-09-22 11:04 GMT
అనంతపురం వేడెక్కింది. ఓ వైపు పోలీసులను కొజ్జాలతో పోల్చి అగ్గి రాజేసిన జేసీ.. ఆ తర్వాత అంతే ధీటుగా మీసం మేలేసి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. దీనికి మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జేసీ.. మధ్యలో ప్రభోదనందా ఎంట్రీ.. వీడియో విడుదల చేసి మొత్తం జేసీ నే చేశాడని ఆరోపణలు.. ఇలా తాడిపత్రి రాజకీయాలు వేడెక్కాయి. పోలీసులు వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతున్నా సీఎం చంద్రబాబు కానీ డీజీపీ కానీ ఎటువంటి స్టెప్ తీసుకోకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇది ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందోనన్న టెన్షన్ మొదలైంది.

*అసలు వివాదమేంటి.?

గణేష్ నిమజ్జనం సందర్భంగా జేసీ తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామానికి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. గొడవ సందర్భంగా పోలీసులంతా పారిపోయారని.. వారితో కలిసి తాను కూడా ప్రాణ భయంతో పారిపోయానని జేసీ వాపోయాడు. పోలీసులు వైఫల్యం చెందారని వారిని ‘కొజ్జా’లతో పోల్చుతూ జేసీ మండిపడ్డారు. దీనిపై పోలీసుల అధికారుల సంఘం కూడా సీరియస్ గా స్పందించింది.  ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.

పోలీసుల హెచ్చరికలకు జేసీ మరోసారి మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చాడు. పారిపోయిన పోలీసులతోపాటు తాను కూడా కొజ్జానేనని.. సెటైర్ వేశారు. తన నాలుక కోస్తా అన్న సీఐ మాధవ్ కు గట్టి పంచ్ ఇచ్చారు. ఇది సినిమా కాదు నిజజీవితం అంటూ మండిపడ్డారు. ‘రేయ్ మాధవ్ ఎన్ని సార్లు నా చుట్టూ తిరిగావో గుర్తు చేసుకో.. నువ్వు నా నాలుక కోస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ సవాల్ విసిరారు.  అనంతరం తాడిపత్రి వెళ్లి సీఐ మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*జేసీకి డబ్బులివ్వలేదనే: ప్రబోధానంద

ప్రబోధనంద ఆశ్రమంలో జరిగిన ఘటనను, పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తాజాగా ప్రభోదనంద ఎంట్రీ ఇచ్చాడు. ఓ వీడియో విడుదల చేసి జేసీకి గట్టి సమాధానం ఇచ్చారు. జేసీ డబ్బులు డిమాండ్ చేయడం.. తాను ఇవ్వకపోవడంతోనే కక్ష కట్టి నీళ్లు, కరెంట్ నిలిపివేశారని.. తాము లొంగకపోవడంతో ఇప్పుడు చిన్నపొలమడ గ్రామంలోని కొంత మంది గ్రామస్థులను అడ్డుపెట్టుకొని గణేష్ నిమజ్జనం వేళ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఐ సురేంద్రనాథ్ రెడ్డిని అడ్డం పెట్టుకొని గొడవ సృష్టించి తమను కేసుల్లో ఇరికించాలని జేసీ బ్రదర్స్ కుట్ర పన్నారని ప్రబోధనంద సంచలన విషయాలు వెల్లడించారు. తమ ఆశ్రమ భవనాన్ని కూల్చేయాలని చూశారని.. ఆశ్రమంలో ఉన్న 64 సీసీ కెమెరాల్లో చూసి ప్రభుత్వం విచారించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇక తాజాగా ప్రబోధనంద ఆశ్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాడిపత్రి ముస్లింలు శుక్రవారం ర్యాలీ నిర్వహించడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు, అటు జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆశ్రమం, చిన్నపొలమడ గ్రామస్థులు, ముస్లింలు ఇలా వర్గాలుగా విడిపోయి కేసులు, ఆందోళనతో వివాదం పెద్దదిగా మారింది.

కాగా జేసీ తీవ్ర వ్యాఖ్యలు .. దానికి పోలీసుల కౌంటర్ పూర్తయ్యింది. ఇప్పుడు మరోసారి జేసీ ఇంకా దారుణంగా మాట్లాడేశాడు. దీంతో జేసీ పై డీజీపీతో పాటు సీఎం దృష్టికి తీసుకెళ్లాలా.? లేక వారు స్పందించకపోవడంతో తామే చర్యలు తీసుకోవాలా అనే దానిపై పోలీసులు సీరియస్ గా సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు స్పందించకపోతే ప్రజల్లో అభాసుపాలవుతామని.. చులకన భావన ఏర్పడుతుందని పోలీసులు పట్టుదలతో ఉన్నారట.. ప్రభుత్వం స్పందించి ఈ వర్గపోరుకు ముగింపు పలుకకుంటే ఈ వ్యవహారం ముదిరిపాకాన పడే ప్రమాదం ఉంది.
Tags:    

Similar News