జేసీ మాట‌ల‌కు.. వారి అబ్బాయ్ కి సంబంధం లేద‌ట‌!

Update: 2019-04-25 04:55 GMT
జేసీ దివాక‌ర్ రెడ్డి మాట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఎవ‌రేం అనుకుంటే నాకేం.. నేనేం అనుకుంటే అదే చెబుతా అన్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. ప్ర‌త్య‌ర్థి మొద‌లు పార్టీ అధినేత వ‌ర‌కూ ఎవ‌రైనా స‌రే.. డోన్ట్ కేర్ అన్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హారం ఉంటుంది. న‌చ్చిన మాట‌ల్నే కాదు.. న‌చ్చ‌ని మాట‌ల్ని నిర్మోహ‌మాటంగా చెప్పే జేసీ తీరుతో.. ఆయ‌న ఎప్పుడేం మాట్లాడ‌తారో అర్థం కాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. జేసీగారి అబ్బాయ్ ప‌వ‌న్ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జేసీ రాజ‌కీయ వార‌సుడిగా ఇమేజ్ ఉన్న ఇతగాడి తాజా మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. తండ్రి తీరుకు భిన్నంగా ఆయ‌న మాట్లాడుతున్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు విష‌య‌మై.. జేసీ చేసిన వ్యాఖ్య‌లపై మీడియా అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న ఇస్తున్న స‌మాధానం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తండ్రి మాదిరి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌ని ప‌వ‌న్‌.. వివాదాల జోలికి పోకూడ‌ద‌న్న డిఫెన్స్ స‌రిగా లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఒక్కొక్క‌రికి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టమే మంచిది. అంతేకాదు.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే అభాసుపాలు కావ‌టం ఖాయం. తాజాగా ప‌వ‌న్ తీరు అలానే ఉంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల ఖ‌ర్చు మీద తండ్రి చేసిన వ్యాఖ్య‌ను స‌మ‌ర్థించాల్సిన అవ‌స‌రం లేదు. అలా అని త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్లుగా త‌ప్పించుకోవ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.

ఎన్నిక‌ల వ్య‌యం మీద త‌న తండ్రి ఆయ‌న అభిప్రాయం చెప్పార‌ని.. ఆయ‌న మాట‌ల‌తో త‌న‌కెందుకు సంబంధం ఉంటుంద‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య స‌రికాదంటున్నారు. తండ్రి ఏదైనా చెప్పిన‌ప్పుడు.. ఆ విష‌యం వివాదాస్ప‌ద‌మైన‌ప్పుడు దాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌టం.. తండ్రి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చేయ‌టం చేయాలి. అంతేకానీ.. మా నాన్న మాట‌ల‌తో నాకేం సంబంధం అంటే ఎలా ప‌వ‌న్‌?  జేసీ గార‌బ్బాయ్ అంటే ఎలా ఉండాలి?  అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్ మాట‌లు జేసీ ఫ్యాన్స్ ను నిరాశ‌ప‌రిచేలా ఉంటున్నాయ‌ని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు త‌గ్గించే విష‌యం మీద చైత‌న్యం తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెప్పారు. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు త‌గ్గించేందుకు ఒక ఎన్జీవోను ఏర్పాటు చేసి.. ప్ర‌జ‌ల్లో మార్పు కోసం ప్ర‌య‌త్నం చేయాల‌ని త‌న తండ్రి భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉండి చేయ‌ని ప‌ని.. ఎన్జీవోను పెట్టి మార్పు చేయ‌ట‌మా?
Tags:    

Similar News