ఎంపీగా పోటీకి జేడీ రెడీ. ...టీడీపీ...జనసేన...బీజేపీ నుంచి..?

Update: 2022-10-22 08:07 GMT
జేడీ లక్ష్మీ నారాయణ. మేధావి. నిజాయతీపరుడు. నిరాడంబరుడు. ఆయన కరడు కట్టిన పోలీసు అధికారి. విధి నిర్వహణలో ఆయన సింహమే. అయితే జనాల సమస్యల మీద ఆయన దృష్టి సారించినపుడు ఒక సేవకుడిగా మారిపోతారు. వారి బాధలను చూసి అల్లాడిపోతారు. నిజానికి ఆయన దేశంలో నంబర్ వన్ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఇంకా బోలెడు సర్వీసు ఉండగా కేవలం ప్రజా సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఆయనే జేడీ లక్ష్మీ నారాయణగా సుప్రసిద్ధమైన వీవీ లక్ష్మీనారాయణ. ఆయన సీబీఐ జేడీ గా పనిచేయడంతో అదే ఇంటి పేరు అయింది. పుట్టింది సీమ జిల్లా కర్నూల్ ప్రాంతంలో అయినా ఆయన విశాఖ మీద మక్కువ పెంచుకున్నారు. ఒక విధంగా ఆ ప్రాంతాన్ని తన పుట్టిల్లుగా చేసుకుని సమస్యల మీద తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఆలోచనలు ఎంతసేపూ ప్రజల కోసమే ఉంటాయి. వాటి చుట్టూనే తిరుగుతాయి.

ఆయన మేధో సంపత్తి కానీ ఆలోచనలు కానీ ఏ రాజకీయ పార్టీ పరిధిలు పరిమితులకు అందనివి. అయితే ఆయన 2019 ఎన్నికల్లో తొలిసారి విశాఖ నుంచి పోటీ చేసినపుడు జనసేనను ఎంచుకున్నారు. ఆయన తొలిసారి పోటీ చేసినా కూడా రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు సాధించారు. ఒక విధంగా అది ఆయన వ్యక్తిగత ఇమేజ్ గానే అంతా చూశారు. యువతకు, విద్యార్ధులకు, మేధో వర్గానికి ఆయన అంటే ఇష్టం. ఆ విధంగా సాధించిన ఇమేజ్ తో ఆయన కేవలం పది రోజుల ప్రచారంలోనే ఆ స్థాయి ఓట్లను సాధించారు.

ఆ తరువాత ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన బీజేపీలో చేరుతారని, ఆప్ కి నాయకత్వం వహిస్తారని, లేక టీడీపీ నుంచి బరిలో ఉంటారని అనేక వార్తలు వచ్చాయి కానీ ఆయన మాత్రం ఇపుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే విశాఖ నుంచి పోటీ చేయాలని. నిజానికి ఇపుడున్న రాజకీయాల్లో లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయం చాలా సాహసంతో కూడుకున్నదే.

ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు బలంగా ఉండి ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకుంటున్నాయి. ఒక విధంగా చూస్తే ఇండిపెండెంట్లు కూడా గత కొన్ని ఎన్నికల నుంచి ఎక్కడా కనిపించడంలేదు. అంటే వారి బలం ఎక్కడా సరిపోవడం లేదు అన్న మాట. అందువల్ల జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే ఆలోచించాల్సిందే. అయితే ఆయన ఒక పార్టీ ఇమేజ్ ని మించి వ్యక్తిగతంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. విశాఖ వంటి చోట మేధావులు, విద్యావంతులు, యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆయన్ని అభిమానిస్తున్నారు.

దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద అందరి కంటే భిన్నంగా న్యాయ పోరాటం చేస్తున్నారు, హైకోర్టు లో దీని మీద పిటిషన్ వేసి కేంద్రానికి నోటీసులు ఇప్పించేలా చూశారు. ఒక విధంగా కేంద్రం దీని మీద ఏం జవాబు చెబుతుందో చూడాలి. స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఆయన పోరాటం చిత్తశుద్ధితో కూడుకున్నదని అంతా అంటున్నారు.

మొత్తానికి జేడీ విశాఖ బరిలో ఉంటే ఎన్నిక ఆసక్తికరం అనే చెప్పాలి. పార్టీ విధనాలను కాస్తా పక్కన పెట్టి ఆలోచిస్తే ఆయన కంటే మంచి అభ్యర్ధి ఉండరని కూడా చాలా మంది చెబుతారు. గత సారి గెలవాల్సిన జేడీకి త్ర్టిలో అదృష్టం జారింది. మరి ఈసారి అయినా ఆయన ఎంపీగా నెగ్గుతారా. జనాల వివేచన బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా జేడీ లాంటి వారు చట్టసభల్లో ఉండాలనే అంతా కోరుకుంటారు అన్నది నిజం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News