బీజేపీతో జనసేన పొత్తు..శుభసూచకమేనట!

Update: 2020-01-24 15:43 GMT
ఏపీ రాజకీయాల్లో ఓ మోస్తరు ఆసక్తి రేకెత్తించిన బీజేపీ, జనసేనల మధ్య పొత్తుపై చర్చ కూడా ఓ మోస్తరుగానే సాగిందని చెప్పాలి. ఎందుకంటే... ఈ రెండు పార్టీలకు ఉన్నది నామమాత్రమైన ఓటింగే కదా. అయితే ఈ రెండు పార్టీల మధ్య  పొడిచిన కొత్త పొత్తు... జనసేనలో కనిపించకుండాపోయిన ఓ కీలక నేతను మాత్రం బయటకు తెచ్చిందని చెప్పాలి. ఆయన మరెవరో కాదు... ఐపీఎస్ పోస్టును కూడా వదులుకుని సమాజాన్ని ఉద్ధరిద్దామని రాజకీయాల్లోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణే. ఎన్నికల ముంచుకువచ్చే దాకా కొత్త పార్టీ పెడతానంటూ చెప్పుకొచ్చిన మాజీ జేడీ... సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చేసరికి పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరిపోయారు. విశాఖ ఎంపీ సీటును దక్కించుకుని సరికొత్త రీతిలో ప్రచారం చేసి పవన్ మాదిరే ఘోర పరాజయాన్ని చూశారు. ఆ తర్వాత ఇక అత్తా పత్తా లేకుండా పోయారు.

ఇదిగో ఇప్పుడు జనసేన... కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోగానే బయటకు వచ్చేశారు. రెండు పార్టీల మధ్య పొడిచిన కొత్త పొత్తు శుభసూచకమేనని కూడా ఓ కితాబిచ్చారు. అంతేకాదండోయ్... బీజేపీతో పొత్తు దిశగా కీలక నిర్ణయం తీసుకున్న తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను సమర్థిస్తున్నట్లుగా, పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా కూడా మాజీ జేడీ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా... ఎన్నికల తర్వాత దాదాపుగా 8 నెలల పాటు కనిపించకుండా పోయిన తాను... ఇకపై మరోమారు యాక్టివేట్ అవుతున్నానన్న సంకేతాలు ఇచ్చే దిశగా వైసీపీ సర్కారుకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు.

అయినా వైసీపీ సర్కారుపై లక్ష్మీనారాయణ ఏమన్నారన్న విషయానికి వస్తే.. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన వైసీపీ సర్కారుకు సూచించారు.  శాసనమండలి రద్దుపై ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా జగన్ సర్కారుకు సూచించారు. అంతేకాకుండా మండలి రద్దుపై నియమనిబంధనలను అనుసరించాలని కూడా ఆయన వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని మార్పునూ ప్రస్తావించిన మాజీ జేడీ... రాజధాని మార్పు అంశంపై న్యాయస్థానం తన తీర్పు ద్వారా తేలుస్తుందని కూడా పేర్కొన్నారుర. మొత్తంగా తాను చేరిన జనసేన చిత్తుగా ఓడిన తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన మాజీ జేడీ... ఇప్పుడు బీజేపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోగానే బయటకు రావడం నిజంగానే ఆసక్తి రేకెత్తించే అంశమే.
Tags:    

Similar News