ల‌క్ష్మినారాయ‌ణ రూటు.. టీడీపీలోకా - మ‌రోవైపుకా..?

Update: 2020-01-31 16:30 GMT
సీబీఐలో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఒక వ‌ర్గం మీడియా - తెలుగుదేశం పార్టీ అనుకూలురు ఆయ‌న‌ను హీరోని చేయ‌డంతో.. ఆయ‌న‌కు రాజ‌కీయాల మీద గాలి మ‌ళ్లిన‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న ఉన్న ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయితే అనుకున్న రాజ‌కీయ ల‌క్ష్యాల‌ను మాత్రం ఆయ‌న సాధించ‌లేక‌పోయార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇది వ‌ర‌కూ మాజీ ఐపీఎస్ లు ఏదో ఒక పార్టీలోకి చేరి ఎంపీలు - ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రి ప‌దవులు పొందారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అయితే సాధార‌ణ సీఐ స్థాయి ఉద్యోగి గోరంట్ల మాధ‌వ్ త‌న ప‌ద‌విని వ‌దులుకుని వ‌చ్చి ఎంపీ అయ్యారు!

అయితే మాజీ ఐపీఎస్ అయిన ల‌క్ష్మినారాయ‌ణ మాత్రం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌లు అయ్యాకా ఆయ‌న స్త‌బ్ధుగా క‌నిపించారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేశారు. దానికి ప‌వ‌న్ సినిమాల్లోకి వెళ్ల‌డాన్ని సాకుగా చూపించారు. జ‌న‌సేన‌కు ల‌క్ష్మినారాయ‌ణ రాజీనామా చేసే అవ‌కాశాలున్నాయ‌ని చాన్నాళ్లుగానే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇప్పుడు ఆయ‌న‌కు సాకు దొరికింద‌ని దీంతోనే  రాజీనామా చేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

రాజీనామా సంగ‌తి స‌రే, ఇంత‌కీ ల‌క్ష్మినారాయణ త‌దుప‌రి రూటు ఎటు అనేది మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా నిలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌ను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ట‌. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి త‌న పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు పంపించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  వాస్త‌వానికి ఎన్నిక‌ల‌ప్పుడే ల‌క్ష్మినారాయ‌ణ టీడీపీలోకి చేరతారు అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే అప్ప‌టికే ఆయ‌న జ‌గ‌న్ కేసుల‌ను విచారించి ఉండటంతో, ఆయ‌న చేరిక వ‌ల్ల వైసీపీ విమ‌ర్శ‌లు గ‌ట్టిగా చేస్తుంద‌ని వెన‌క్కుత‌గ్గారంటారు. వాళ్లంతా ఒక్క‌టే, అందుకే జ‌గ‌న్ ను జైల్లో పెట్టార‌నే అభిప్రాయాల‌కు బ‌లం చేకూరుతుందని వెన‌క్కు త‌గ్గారంటారు. చివ‌ర‌కు జ‌న‌సేన వైపు వెళ్లారు ల‌క్ష్మినారాయ‌ణ‌.

అలాగే ఆయన అప్ప‌ట్లోనే లోక్ స‌త్తాను టేకోవ‌ర్ చేస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడైతే ల‌క్ష్మినారాయ‌ణ బీజేపీలో చేర‌తారు అనే ఊహాగానాలున్నాయి. అయితే ఆయ‌న‌ను త‌న పార్టీలోకి చేర్చుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మినారాయ‌ణ ప‌చ్చ‌ద‌ళంలో క‌లిసి పోతారా, లేక కాషాయ తీర్థం పుచ్చుకుంటారా.. అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


Tags:    

Similar News