కొత్త పార్టీతో వ‌స్తున్న ల‌క్ష్మీనారాయ‌ణ

Update: 2018-11-23 09:26 GMT
సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? రారా? వ‌స్తే ఏ పార్టీలో చేరుతారు? ఎవ‌రితో క‌లిసి న‌డుస్తారు?

ఆయ‌న ముంద‌స్తు ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న నాటి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయవ‌ర్గాల్లో - ప్ర‌జ‌ల్లో న‌డుస్తున్న చ‌ర్చ ఇది. తాజాగా ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ల‌క్ష్మీనారాయ‌ణ సమాధానం చెప్పశారు. త‌న రాజ‌కీయ అరంగేట్రాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే - అంతా ఊహించిన‌ట్లుగా తాను ఏ పార్టీలోనూ చేర‌బోవ‌డం లేద‌న్నారు. తాను కొత్త పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 26న త‌న పార్టీని ప్రారంభించ‌నున్న‌ట్లు ల‌క్ష్మీనారాయ‌ణ వెల్ల‌డించారు. అదే రోజున పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తాన‌ని - పార్టీ సిద్ధాంతాల‌ను కూడా వెల్లడిస్తాన‌ని తెలిపారు.

ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ ఏర్పాటు ఖాయం కావ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. పార్టీ స్థాప‌న వెనుక ఆయ‌న ల‌క్ష్యాలు ఏంట‌నే విష‌యంపై భిన్న ఊహాగాన‌లు వెలువడుతున్నాయి. పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ హైద‌రాబాద్‌ లో రామోజీ గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావును క‌ల‌వ‌డం కూడా ప‌లు ఊహాగానాల‌కు తావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల సామ‌ర్థ్యం రామోజీరావు సొంత‌మ‌ని ప‌లువురు చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌జా కూట‌మి వెనుక కూడా ఆయ‌న హ‌స్త‌ముంద‌ని విశ్లేషిస్తుంటారు. అందుకే చాలామంది ఆయ‌న్ను రాజ‌కీయ రాజ‌గురువుగా కూడా సంబోధిస్తుంటారు. దీంతో రామోజీతో సీబీఐ మాజీ జేడీ స‌మావేశం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

ల‌క్ష్మీనారాయ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో బ‌ల‌మైన ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు. రాజ‌కీయ పార్టీ స్థాప‌న నేప‌థ్యంలో ఆ వ‌ర్గం ఓట‌ర్లు ఆయ‌న వైపు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ఓ పార్టీకి స‌ద‌రు సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లున్నాయ‌ని.. ల‌క్ష్మీనారాయ‌ణ రాక‌తో ఆ ప‌రిస్థితి తారుమార‌వ్వొచ్చ‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ వ‌ర్గం ఓట్లు చీల్చి ఓ పార్టీకి న‌ష్టం చేకూర్చాల‌న్న ల‌క్ష్యంతోనే కొంద‌రు ప్ర‌ముఖులు క‌లిసి ల‌క్ష్మీనారాయ‌ణ‌తో పార్టీ పెట్టిస్తున్నార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది.
Tags:    

Similar News