పవన్ కు నో చెప్పాక ‘లక్ష్మీ’ ఆప్షన్ పచ్చదళమే

Update: 2018-04-06 14:30 GMT
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వాలంటరీ రిటైర్మెంట్ కు చేసుకున్న దరఖాస్తుకు నేడో రేపో అనుమతి వచ్చేస్తుంది. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ఆయన తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేసేస్తారు. ఇప్పటికే ప్రజాజీవితంలోకి రావాలని... సమాజం కోసం ఏమైనా చేయాలని ఉన్నట్లుగా రాజకీయ సంకేతాలు ఇచ్చిన లక్ష్మీనారాయణ.. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు అనేది అందరికీ ఆసక్తికరమైన అంశం.

నిజానికి సామాజిక వర్గ సమీకరణలు ఇతర సంకేతాల నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేస్తారని, పవన్ తో జట్టుకట్టి రంగంలోకి దిగుతారనే ప్రచారం చాలా నెలల ముందునుంచే ఉంది. అయితే తాజాగా ఆయన జనసేనలో చేరబోయేది లేదని మాత్రం స్పష్టత ఇచ్చేశారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి అటువైపు వెళ్లే అవకాశం లేదు. ఒక దశలో ఆయన భాజపాలో చేరవచ్చుననే పుకార్లు కూడా ముమ్మరంగానే నడిచాయి గానీ.. ఆ పార్టీ మీద చంద్రబాబు చేసిన విష ప్రచారం నేపథ్యంలో అక్కడ చేరడానికి కూడా లక్ష్మీనారాయణ సాహసించకపోవచ్చు. ఇలాంటి సంక్లిష్టత మధ్య ఇంక జేడీ లక్ష్మీనారాయణ కు మిగిలిన ఆప్షన్ తెలుగుదేశం ఒక్కటే కదా.. అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జనసేనలో చేరబోయేది లేదని తేల్చిచెప్పిన తర్వాత.. తెలుగుదేశం తప్ప మరో ప్రత్యామ్నాయం ఆయనకు లేదని పలువురు అంటున్నారు.

లక్ష్మీనారాయణ- చంద్రబాబు మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయినట్టేనని... సరైన సమయంలో సరైన అస్త్రం అన్నట్టుగా లక్ష్మీనారాయణను చంద్రబాబు తెరమీదకు తెస్తారని కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఒకప్పట్లో జగన్ కేసులను విచారించి... జగన్ ను పనిగట్టుకుని ముప్పుతిప్పలు పెడుతున్నారన్నట్లుగా అనేక విమర్శలను ఎదుర్కొన్న జేడీ లక్ష్మీనారాయణ- ఉద్యోగ విమరణ చేసిన తర్వాత.. తెలుగుదేశం పార్టీలో చేరడం అంటూ జరిగితే గనుక.. అది వైకాపాకే ఎడ్వాంటేజీ అవుతుందని పలువురు అనుకుంటున్నారు. అప్పట్లో జగన్ మీద సాగించిన కేసుల విచారణ పర్వం మొత్తం దురుద్దేశంతో కూడుకున్నదని, తెదేపా స్కెచ్ మేరకే.. వారు అలా చేశారని ప్రజలు భావించే అవకాశం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News