జనసేన వైపు జేడీ చూపు.. పవన్ పిలిస్తే రెడీనా?

Update: 2021-03-05 16:30 GMT
2019 అసెంబ్లీ ఎన్నికల్లో అటు జనసేన.. ఇటు జనసేనాని పవన్ చిత్తుగా ఓడిపోవడం.. ఆర్థిక ఇబ్బందులతో పవన్ మళ్లీ సినిమాలు చేయడంతో ఈ పరిణామాలపై కలత చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాన్ లో చిత్తశుద్ధి లేదని రాజీనామా చేసి ఈ పార్టీ నుంచి వైదొలిగారు.

అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా జేడీ లక్ష్మీనారాయణ మరో పార్టీలో చేరలేదు. ప్రయత్నించలేదు. కానీ మళ్లీ జేడీ జనసేన పార్టీలోకి రాబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. సొంతగూటికి జేడీ వస్తే పవన్ తీసుకుంటారనేలా పరిణామాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది.

తాజాగా జేడీ 99 టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వాదన మొదలైంది. 'జనసేనలోకి మళ్లీ వెళతారా? పవన్ ఫోన్ చేసి పిలిస్తే కలవంటే కలుస్తారా? ' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేడీ లక్ష్మీనారాయణ ఆచితూచి స్పందించారు.తాను గోడలు కట్టుకొని కూర్చొనే మనిషిని కాదని.. పవన్ పిలిస్తే ఫోన్ చేస్తే తన ఆలోచనలు పంచుకుంటానని లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జనసేన నేతలతో తనకు సంబంధాలున్నాయని.. కలుస్తుంటామన్నారు.

జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చాక కూడా తాను పవన్ ను ఒకసారి కలిశానన్నారు. రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. తాను ద్వేషంతో గోడలు కట్టుకొని ఉండనన్నారు.జేడీకి జనసేన ద్వారాలు ఓపెన్ చేసి ఉంటే వెళ్తారా? అంటే నవ్వుతూ సమాధానం దాటవేశారు. దీన్ని మళ్లీ జేడీ చూపు జనసేన వైపు పడిందని.. ఆయన వస్తానంటే పవన్ తీసుకుంటారనేలా హింట్ ఇచ్చారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
Tags:    

Similar News