కుమార సీఎం అయ్యాకే ఆ ఎమ్మెల్యేల విడుద‌ల!

Update: 2018-05-21 07:59 GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయం ఒక కొలిక్కి వ‌చ్చేసింద‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. అసెంబ్లీలో బ‌లాన్ని నిరూపించుకోలేక‌ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి య‌డ్యూర‌ప్ప రాజీనామా చేయ‌టం.. కుమ‌ర‌స్వామి కాబోయే సీఎం కావ‌టం ఖాయ‌మైన‌ప్ప‌టికీ.. జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు హోట‌ల్ చెర త‌ప్ప‌టం లేదు.

బీజేపీ స‌ర్కారు ప‌డిపోయిన త‌ర్వాత కూడా కుమార‌స్వామి క్యాంప్ రాజ‌కీయాల్ని కొన‌సాగిస్తున్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే వ‌ర‌కూ త‌న పార్టీ ఎమ్మెల్యేల్ని హోట‌ళ్ల‌లోనే ఉంచేలా ఏర్పాట్లు చేశారు. గురువారం అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు ప్ర‌త్యేకంగా స‌మావేశం కావాల్సి ఉంది. అప్పుటి వ‌ర‌కూ ఎమ్మెల్యేల్ని బ‌య‌ట‌కు పంప‌కుండా ఉండ‌టం.. బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యంలో హోట‌ల్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లి.. ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని తేలిన త‌ర్వాత మాత్ర‌మే ఎమ్మెల్యేల‌కు హోట‌ల్ చెర త‌ప్పుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

హైద‌రాబాద్ క్యాంప్ నుంచి బెంగ‌ళూరుకు తీసుకెళ్లిన త‌ర్వాత కూడా అక్క‌డి స్యాంకీ రోడ్డులోని లీ మెరిడియ‌న్ లో జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు బ‌స క‌ల్పించారు. వారితో కుమార‌స్వామి ఎప్ప‌టిక‌ప్పుడు భేటీ అయి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అదే స‌మ‌యంలో జేడీఎస్ ఎమ్మెల్యేల మాదిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌స కూడా ఇందిరాన‌గ‌ర్ లోని హిల్ట‌న్ హోట‌ల్లో సాగుతోంది.

ఓప‌క్క గెలిచిన ఎమ్మెల్యేల్ని హోట‌ళ్ల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌ని పార్టీ నాయ‌క‌త్వాలు.. మ‌రోవైపు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్య‌ర్థుల్ని హోట‌ళ్ల‌కు పిలిపించి వారిని బుజ్జ‌గించ‌టం.. వారికి భ‌విష్య‌త్తుకు ఇబ్బంది లేద‌న్న భ‌రోసాను ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు పార్టీల్లోనూ మంత్రి ప‌ద‌వుల కోసం పోటీ ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో.. రెండు పార్టీల మ‌ధ్య ప‌ద‌వుల పంప‌కాల‌పై ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు సాగుతున్నాయి. 
Tags:    

Similar News