కొడుకే కాదు.. ఆ అమ్మ కూడా తక్కువదేం కాదట

Update: 2016-05-11 07:32 GMT
బీహార్ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి ఫ్యామిలీ యవ్వారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెగారి పుత్రరత్నం నాలుగు రోజుల క్రితం తన కారును ఓవర్ టేక్ చేశారంటూ మండిపడుతూ.. తనదగ్గరున్న తుపాకీతో కాల్చి పారేసిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బీహార్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటం.. ఈ ఎమ్మెల్సీ అమ్మపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేయటంతో.. అండర్ గ్రౌండ్ లో దాగి ఉన్న కొడుకు వివరాలు చెప్పటం తెలిసిందే.

ఇప్పటికే తప్పుడు పనులు చేసిన ఆమె భర్త జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే.. అధికారమదంతో మిడిసిపడే కొడుకు తాజాగా రిమాండ్ లోకి వెళ్లటం తెలిసిందే. అయితే.. సదరు ఎమ్మెల్సీ మనోరమా దేవి కూడా తక్కువేం తినలేదన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆమె పుత్రరత్నాన్ని అదుపులోకి తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమె ఇంటిని నిశితంగా తనిఖీ చేసినప్పుడు విదేశీ మద్యం సీసాలు భారీగా దొరకటం సంచలనంగా మారింది.

ప్రస్తుతం బీహార్ లో మద్య నిషేధం అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విదేశీ మద్యంతో పాటు.. నిషేధిత వస్తువుల్ని ఇంట్లో ఉంచుకున్న నేరానికి ఇప్పుడు ఆమెపై కూడా కేసు నమోదైంది. మనోరమాదేవి ఇంటి యవ్వారం గురించి తెలిసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్టీ ఎమ్మెల్సీ అయిన ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఫ్యామిలీ కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో బీహార్ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమెను ఏ క్షణంలో అయినా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలోఆమె కనిపించకుండా పోయినట్లుగా చెబుతున్నారు. ఆమె ఫోన్ స్విచ్ఛాప్ లో ఉండటమే కాదు.. గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఆమెకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే.. మాజీ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఫ్యామిలీ సామాన్యమైనదిలా కనిపించట్లేదే.
Tags:    

Similar News