వెండి తెరపైకి ‘జీవజ్యోతి’.. సినిమాగా అసాధారణ పోరాటం!

Update: 2021-07-09 08:32 GMT
త‌రాలు మారినా..  ఈ స‌మాజంలో స్త్రీ మీద ఉన్న అభిప్రాయం మాత్రం పెద్ద‌గా మార‌లేద‌నే చెప్పాలి. మ‌హిళ‌ను విలాస వ‌స్తువుగా చూసేవారికి ఇక్క‌డ‌ కొద‌వేలేదు. డబ్బు, అధికారం ఉంద‌నే మ‌దంతో ఎంతో మంది మ‌హిళ‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ‌డం చూస్తున్న‌దే. లొంగ‌ని వారిని ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో లోబ‌ర్చుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి ఓ కామాంధుడు చేసిన దారుణానికి ఓ మ‌హిళ జీవితం స‌ర్వ‌నాశం అయ్యింది. ఆమె పేరే.. ‘జీవజ్యోతి’.

ప్రముఖ హోటల్ శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ య‌జ‌మాని రాజ‌గోపాల్‌.. త‌న హోట‌ల్లో ప‌నిచేసే కార్మికురాలు జీవ‌జ్యోతిపై క‌న్నేశాడు. ఆమెను లొంగ‌దీసుకునేందుకు చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాడు. కానీ.. ఆమె అంగీక‌రించ‌లేదు. దీంతో.. ఏకంగా ఆమె భ‌ర్త‌నే చంపించాడు. ఈ విష‌యం అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ దారుణానికి పాల్ప‌డిన రాజ‌గోపాల్ కు శిక్ష ప‌డేందుకు ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా 18 సంవ‌త్స‌రాల‌పాటు పోరాటం సాగించింది జీవ‌జ్యోతి. చివ‌ర‌కు న్యాయ‌స్థానంలో విజ‌యం సాధించింది కూడా.

ఆమె జీవితం ఇప్పుడు సినిమాగా రాబోతోంది. జీవ జ్యోతి బ‌యోపిక్ ను రూపొందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. జంగిల్ పిక్చ‌ర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. దీనిపై బాధితురాలు జీవ‌జ్యోతి స్పందించారు. త‌న‌పై జ‌రిగిన దారుణాన్ని సినిమాగా తీసేందుకు సిద్ధ‌మ‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సినిమా ద్వారా మ‌హిళ‌ల‌పై జ‌రిగే దారుణాలు ఏ విధంగా ఉంటాయో తెలుస్తుంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే న‌టీ న‌టుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News