ధ‌ర్మం ద‌గ్గ‌ర మొద‌లై రేవంత్ ద‌గ్గ‌ర ఆగింది

Update: 2017-10-31 06:18 GMT
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన రేవంత్ ముచ్చ‌ట ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా రేవంత్ తీసుకున్న నిర్ణ‌యం ప్ల‌స్సా.. మైన‌స్సా అన్న విష‌యంపై ఎవ‌రికి వారు లెక్క‌లు చెబుతున్నారు. అధికార పార్టీ నేత‌ల నుంచి విపక్షాల వ‌ర‌కూ ఈ చ‌ర్చ సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ జ‌రుగుతున్న స‌మ‌యంలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో.. అధికార విపక్షాల‌కు చెందిన నేత‌లు ఎదురు ప‌డిన వెంట‌నే రేవంత్ ముచ్చ‌ట వారి మాట‌ల్లో వ‌స్తోంది.

ఒక‌వేళ వేరే విష‌యం మీద చ‌ర్చ మొద‌లైనప్ప‌టికీ చివ‌ర‌కు మాత్రం రేవంత్ ఇష్యూతోనే ముగుస్తున్న వైనం క‌నిపిస్తోంది. నిన్న‌టి అసెంబ్లీ లాబీల్లోనూ.. మీడియా పాయింట్ ద‌గ్గ‌ర నేత‌లు క‌లుసుకున్న స‌మ‌యంలో రేవంత్ ప్ర‌స్తావ‌న ఎక్కువ‌గా వ‌చ్చింద‌ని చెప్పాలి.

పెద్ద ఎత్తున సాగిన చ‌ర్చ‌ల్లో కొన్ని చ‌ర్చ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవ‌న్ రెడ్డితో పాటు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి.. ఎ.జీవ‌న్ రెడ్డిల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఆస‌క్తికరంగా  సాగింది. వీరు ముగ్గురు క‌లిసిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ధ‌ర్మం త‌ప్ప‌కుండా సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కేసీఆర్ క‌ల‌వ‌టం న్యాయ‌మే.. అయితే మా వాళ్లు ఎన్నిక‌ల్లో క‌లుపుకోకుండా త‌ప్పు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మీరు క‌లుపుకోనందుకే టీఆర్ ఎస్ గెలిచి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగింద‌ని ముత్తిరెడ్డి బదులిచ్చారు. దీనికి కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి స్పందిస్తూ.. అదే త‌మ‌కిప్పుడు స‌మ‌స్య‌గా మారింద‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం వారి సంబాష‌ణ‌ల్లో రేవంత్ రెడ్డి వ్య‌వహారం వ‌చ్చింది. రేవంత్‌ ను ఎందుకంత పెద్ద లీడ‌ర్‌ ను చేస్తారంటూ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి త‌న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. దీనికి మ‌రోసారి స్పందించిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. రేవంత్ కాంగ్రెస్ లో చేర‌టం స‌ముద్రంలో నీటి బిందువు చేర‌టం లాంటిదేన‌ని బ‌దులివ్వ‌టం క‌నిపించింది.

ఇదే తీరులో ప‌లువురు రేవంత్ అంశంపై మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.
Tags:    

Similar News