తెలంగాణ గొర్రెల కాప‌రి జీతం 60 వేలా?

Update: 2017-06-21 05:37 GMT
మాట‌ల‌తో రంగుల సినిమాను ఆవిష్క‌రించ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌హ‌స్తులు. అదేం మ‌హ‌త్య‌మో కానీ కేసీఆర్ నోటి నుంచి మాట‌లు వ‌స్తుంటే.. త‌ర్కం వ‌దిలేసి.. చేష్ట‌లుడిగిన‌ట్లుగా.. ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఆయ‌న మాట‌ల్ని వినేస్తుంటారు. ఆయ‌న మాట్లాడుతున్న‌పుడు ప్ర‌శ్నించ‌టం అన్న‌ది గుర్తుకు రాదు. క్రాస్ చెక్ అస‌లే ఉండ‌దు. ఇలా ఆయ‌న చెప్పిన మాట‌లు మెద‌డు లోప‌లికి వెళ్లిపోయి.. అదే ప‌నిగా గింగురుమంటుంటాయి.

అంత‌టి శ‌క్తి కేసీఆర్ మాట‌ల‌కు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు గొర్రెల పెంప‌కం మీద ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుముల‌కు ఉచితంగా మేక‌ల మంద‌ను ఇచ్చి.. వాటిని జాగ్ర‌త్త‌గా పెంచి.. డ‌బ్బులు సంపాదించండంటూ పాఠాలు చెబుతున్నారు. త్వ‌ర‌లో తాను పంపిణీ చేయ‌నున్న గొర్రెల్ని జాగ్ర‌త్త‌గా పెంచితే మూడేళ్ల వ్య‌వ‌ధిలో గొల్ల కురుమ‌లు రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి తేగ‌ల‌రంటూ లెక్క‌లు చెప్పుకొచ్చారు. మూడేళ్ల వ్య‌వ‌ధిలో గొర్రెల పెంప‌కం ద్వారానే ఇంత భారీ ఆదాయం జ‌న‌రేట్ అవుతుందంటే అంత‌కు మించేం కావాల‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇదంతా కేసీఆర్ మాట‌ల ప్ర‌భావంతో ఇలా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాటికి స్వానుభ‌వంతో చెప్పే మాట‌లు క‌నువిప్పు క‌ల‌గ‌ట‌మే కాదు.. రియ‌ల్ కష్టాలు క‌ళ్ల ముందు ఆవిష్క‌రించేలా చేస్తాయి.

ఇలాంటి మాట‌ల్నే తాజాగా చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌.. సీఎల్పీ ఉప నేత టి.జీవ‌న్ రెడ్డి. తాజాగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు గొర్రెల్ని పంపిణీ చేస్తున్న నేప‌థ్యంలో ఎదుర‌య్యే అస‌లు స‌మ‌స్య‌ల్ని తెర మీద‌కు తెచ్చారు. త‌న ద‌గ్గ‌ర 400 గొర్రెలు ఉన్నాయ‌ని.. వాటిని కాచేందుకు మ‌నుషులు దొర‌క‌ని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోయారు. త‌న గొర్రెల కాప‌రికి రూ.60 వేల జీతం ఇస్తున్నాన‌ని.. ఏదైనా ప‌ర్స‌న‌ల్‌ ప‌ని ఉంద‌ని గొర్రెల కాప‌రి ప‌నిలోకి రాకుంటే ఆరోజు చాలా క‌ష్ట‌మేన‌ని వాపోయారు. నేనైతే గొర్రెల వెంబ‌డి పోను క‌దా? మున్ముందు గొర్రెల ల‌బ్ధిదారుల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌న్నారు.

జీవాల‌కు వ‌చ్చే వ్యాధుల గురించి జ‌ర జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. లేదంటే ప్ర‌భ‌త్వం ఇచ్చే డ‌బ్బుల ముచ్చ‌ట ఏమో కానీ.. ఇంట్లో ఉన్న డ‌బ్బులు పోయే ప‌రిస్థితి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. త‌న స్వానుభ‌వం గురించి జీవ‌న్ రెడ్డి చెబుతుంటే.. ఆయ‌న మాట‌ల‌కు స‌భ‌లో న‌వ్వులు విర‌బూసాయి. అయితే, జీవ‌న్ రెడ్డి స‌మ‌స్య‌ను కూడా ముందే ఊహించి గొర్రెల‌కు కూడా 108 లాగే ఒక కాల్ సెంట‌ర్ పెట్టారులేండి. మ‌ర‌దెలా ప‌నిచేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News