మత్తయ్య ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలుసా?

Update: 2016-02-21 05:26 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించటంతో పాటు.. ఇద్దరు చంద్రుళ్ల నడుమ నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న వరకూ వెళ్లిన ఈ వ్యవహారంలో మత్తయ్య కీలకపాత్ర పోషించినట్లుగా చెబుతారు. ఈ కేసులో నిందితుడైన మత్తయ్య.. ఏపీకి వెళ్లటం.. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం లాంటివి చేసి.. తెలంగాణ సర్కారును చిరాకు పుట్టించాడు కూడా. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు కొరుకుడుపడని రీతిలో తయారైన మత్తయ్య మీద అధికారులు ఫోకస్ చేసినా.. అతగాడు ఏపీకి వెళ్లిపోవటం.. కోర్టు నుంచి తెచ్చుకున్న ఆదేశాలతో ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోలేని పరిస్థితి.

ఈ కేసు విషయం ఒక కొలిక్కి వచ్చి.. కొద్ది రోజులుగా ఎవరూ ఏమా మాట్లాడని పరిస్థితుల్లో.. ఇటీవల మత్తయ్యకు ఏసీబీ నోటీసులు ఇవ్వటం తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలని అధికారులు కోరటం.. విచారణ సందర్భంగా మత్తయ్యను అరెస్ట్ చేయమని చెప్పారు. దీంతో.. అధికారుల ముందుకు మత్తయ్య హాజరయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ.. అనుకోనివిధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఏపీలోని గుంటూరులో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో మధ్యలో తీవ్రమైన బీపీతో మత్తయ్య కూలిపోయారని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను ఉన్న ఫళంగా నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స జరిపిస్తున్నట్లు మత్తయ్య సతీమణి జోస్పిన్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారుల ముందుకు విచారణకు హాజరు కావాల్సిన మత్తయ్య.. ఇప్పుడు అనారోగ్యంతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో మత్తయ్య సతీమణి మాట్లాడుతూ.. తన భర్త ప్రాణాలకు ఏదైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర సర్కారుదే బాధ్యత అంటూ ఆమె హెచ్చరిస్తున్నారు. మత్తయ్య అనారోగ్యం ఎపిసోడ్ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News